ఢిల్లీ, మహా.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత, రాజ్యసభ సభ్యుడు నితీశ్ కుమార్ మంగళవారం సమావేశమయ్యారు. పార్లమెంట్ హౌస్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి తర్వాత నితీశ్ కుమార్ ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సమావేశంలో బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాలు, బీజేపీ ఓటమికి దారితీసిన కారణాలు, బిహార్‌లో ఎన్డీయే కూటమి భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. నితీశ్ కుమార్‌తో పాటు కేంద్ర మంత్రి, జేడీయూ సీనియర్ నాయకుడు రాజీవ్ రంజన్ సింగ్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ కుమార్ ఝా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే సమావేశంలో చర్చించిన అంశాలపై ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. భేటీ జరిగిన విషయాన్ని మాత్రమే ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఇటీవల జరిగిన బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ బలమైన స్థావరంగా భావించే ఈ స్థానాన్ని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కైవసం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా, నీరజ్ కుమార్ సిన్హాకు 44,827 ఓట్లు లభించాయి.
బాంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జన్ సురాజ్ పార్టీ విజయం సాధించడంతో బిహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో జరిగిన మోదీ–నితీశ్ భేటీ ఎన్డీయే భవిష్యత్ వ్యూహానికి సంబంధించి కీలకంగా మారింది.






