సంత్ రవిదాస్ సందేశం సామాజిక సమరసతకు మార్గదర్శకం.
• 650వ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘పవన్ మట్టి కలశ్’ కార్యక్రమంలో డా. పొంగులేటి.
హైదరాబాద్, మహా:
సంత్ రవిదాస్ బోధించిన సామాజిక సమానత్వం, సామరస్యం, మానవ గౌరవం, జాతీయ ఐక్యత లాంటి విలువలు నేటి సమాజానికి ఎంతో అవసరమని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ సహ ఇన్చార్జి (తమిళనాడు, కర్ణాటక) డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం శ్యామ ప్రసాద్ ముఖర్జీ భవన్లో నిర్వహించిన ‘సంత్ రవిదాస్ పవన్ మట్టి కలశ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయం, కరుణ, సమాన అవకాశాలతో కూడిన సమాజ నిర్మాణమే సంత్ రవిదాస్ ఆశయమని, ప్రతి ఒక్కరూ అదే మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపంలో ఉన్న సీర్ గోవర్ధన్పూర్ (సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ జన్మస్థలం) నుంచి తీసుకువచ్చిన పవిత్ర మట్టితో కూడిన కలశం, దేశవ్యాప్తంగా సాగుతున్న ‘సమరసత సంకల్ప్ అభియాన్’లో భాగంగా తెలంగాణకు చేరుకుందని డాక్టర్ పొంగులేటి తెలిపారు. సంత్ రవిదాస్ 650వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ కలశ యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్ – సబ్కా ప్రయాస్’ సంకల్పాన్ని సాకారం చేయడంలో సామాజిక సమరసత కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. దేశ ఐక్యత, సమాజంలో సౌభ్రాతృత్వం మరింత బలోపేతం కావాలంటే ప్రతి పౌరుడు సమరసత భావనతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ రాజ్, తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్, కొప్పు బాషా, ప్రకాశ్ రెడ్డి, పాపారావు, డాక్టర్ సురేఖ, ఓం ప్రకాశ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







