Mahaa Daily Exclusive

  గడ్కరీపై తప్పుడు ప్రచారానికి హైకోర్టు చెక్…

Share

గడ్కరీపై తప్పుడు ప్రచారానికి హైకోర్టు చెక్.
• అభ్యంతరకర కంటెంట్ తొలగించాలని ఎక్స్‌, మెటాకు ఆదేశం.

ముంబై, మహా.

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న తప్పుడు కంటెంట్‌పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌కు సంబంధించిన అంశంపై సోషల్ మీడియా వేదికల్లో ప్రసారమవుతున్న అభ్యంతరకర పోస్టులు, వీడియోలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా రూపొందించిన కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్, మెటా సంస్థలను న్యాయస్థానం ఆదేశించింది.

ఈ కంటెంట్‌ను ఎవరు రూపొందించారు, ఎవరు సోషల్ మీడియా వేదికల్లో అప్‌లోడ్ చేశారు అనే పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని కూడా ఎక్స్, మెటా సంస్థలను బాంబే హైకోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న ఖాతాల వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది.

సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు సమాచారం, మార్ఫింగ్ చేసిన వీడియోలు, ఏఐ సాయంతో రూపొందించిన నకిలీ కంటెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు అత్యంత ప్రాధాన్యంగా పరిగణించింది. సాంకేతికతను దుర్వినియోగం చేసి వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కృత్రిమ మేధ ఆధారిత కంటెంట్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. తప్పుడు సమాచారం, నకిలీ వీడియోలు, మార్ఫింగ్ చేసిన దృశ్యాల ద్వారా వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే కంటెంట్‌పై వెంటనే చర్యలు తీసుకుని, వాటి వ్యాప్తిని అడ్డుకునే సమర్థ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఎక్స్, మెటాకు న్యాయస్థానం ఆదేశించింది.