తెలుగు సాహిత్యానికి వెయ్యేళ్ల నాటి చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేసే విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాథా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది.
తెలుగు సాహిత్యంలో అనేక పద్దతులు ఉన్నాయి
– జానపద సాహిత్యము
– వచన కవితా సాహిత్యము
– పద కవితా సాహిత్యము
– పద్య కవితా సాహిత్యము
– చంపూ సాహిత్యము
– శతక సాహిత్యము
– నవలా సాహిత్యము
– చిన్న కథలు
– అవధానములు
– ఆశుకవిత
– సినిమా సాహిత్యము
– తెలుగు సాహిత్య విమర్శ
తెలుగు సాహితీచరిత్రలో ముఖ్య ఘట్టాలు
ఇలా మొదలు..
– స్త్రీల కోకిల కంఠములలో, కర్షక శ్రామికుల స్వేదంలో, జానపదుల సంతోషాలలో తెలుగువారి ఘనమైన పండుగలలో తెలుగు సాహితీ చరిత్ర మొదలయింది.
తరువాత తొమ్మిదవ శతాబ్దం నుండి శిలా శాసనాలకు ఎక్కింది. పదకొండవ శతాబ్దములో ఆదికవి నన్నయ్య చేతిలో, ఆంధ్ర మహాభారతం రూపంలో ఆదికావ్య రచన మొదలయింది. ఈ ఆంధ్ర మహాభారతమును పద్నాలుగవ శతాబ్దాంతానికి తిక్కన, ఎర్రనలు పూర్తి చేసారు. ఈ ముగ్గురూ తెలుగు కవిత్రయము అని పేరుపొందినారు.
పదనేనవ శతాబ్దంలో గోన బుద్ధారెడ్డి రామాయణమును తెలుగువారికి తెలుగులో అందించాడు. పదుహేనవ శతాబ్దంలో బమ్మెర పోతనామాత్యుడు భాగవతమును తేట తెలుగులో రచించి, తెలుగువారిని ధన్యులను గావించాడు. పోతనకు సమకాలికుడైన శ్రీనాథ కవిసార్వభౌముడు తన ప్రబంధాలతో తెలుగుభాషకు ఎనలేని సేవ చేసాడు.
తెలుగు వైభవం
పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు. పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది
పదకవితా పితామహుడైన అన్నమయ్య తిరుపతి వేంకటేశ్వరునిపై రచించి, పాడిన ముప్పైరెండువేల పద్యాలు ఓ ప్రత్యేక సాహితీ భాండాగారం.
క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు వ్రాసిన కీర్తనలు నేటికీ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి. త్యాగరాజ కీర్తనలు కర్ణాటక సంగీతానికి ఆయువుపట్టు వంటివి.
బ్రౌను సేవలు
తెలుగు భాషకు బ్రౌను చేసిన సేవలు బహు శ్లాఘనీయమైనవి. “ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు” అంటారు.
అనేక సాహితీప్రక్రియలతో..
ఆధునిక యుగంలోని గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేతలు, శ్రీశ్రీ, ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేశారు. ఇప్పటికీ తెలుగు వెలుగులతో బాషను బతికించే సేవకులు ఎంతోమంది. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు
– ఎస్
………