తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా సరితా తిరుపతయ్యను నియమించడం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షురాలు తానే కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మార్పు ఖాయమన్న చర్చ పార్టీలో ఉంది. తనకు ఏదో ఒక పదవి ఇచ్చాకే, కొత్త వాళ్ళను పెట్టాలంటూ ప్రస్తుత అధ్యక్షురాలు డిమాండ్ చేస్తోందనే ప్రచారం ఉంది. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతరావు పదవీకాలం ముగిసి ఐదు నెలలు అయింది. కొత్త ప్రెసిడెంట్ నియమకానికి పార్టీ కూడా కసరత్తు చేస్తుంది. కొత్త అధ్యక్షురాలి నియామకం చేపడితే మహిళా కాంగ్రెస్ కోసం తాను చేసిన కృషిని పరిగణలోకి తీసుకుని నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని సునితారావు కోరుతోంది. మరో వారం, పదిరోజుల్లో ఈ వ్యవహారం తేలనుంది. ఈ నేపథ్యంలో గద్వాల నుండి పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిన బీసీ సామాజిక వర్గానికి చెందిన సరిత తిరుపతతయ్యకే దాదాపుగా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాయమైనట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిత నియామకం పట్ల సానుకూలంగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.