Mahaa Daily Exclusive

  మార్పు కోసమే జనచైతన్య యాత్ర….

Share

మార్పు కోసమే జనచైతన్య యాత్ర.
• ధరల నియంత్రణలో మోదీ ప్రభుత్వం ఘోర వైఫల్యం.
• ప్రజలపై భారాన్ని పెంచుతూ.. అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లింపు.
• బీజేపీ విధానాలపై సీపీఐ నేత భాగం హేమంతరావు ధ్వజం.

ఖమ్మం, మహా:

ప్రజా వ్యతిరేక విధానాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పన్నుల భారం, పెరుగుతున్న ఆదాయ వ్యత్యాసం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి.. వారిలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. ధరలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజల కుటుంబ బడ్జెట్లు ఛిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జనచైతన్య యాత్రలో భాగంగా మంగళవారం కొనిజర్ల మండలంలో సీపీఐ నేతలు విస్తృతంగా పర్యటించారు. రామనరసయ్య నగర్‌లో ప్రారంభమైన యాత్ర అన్నవరం, తుమ్మలపల్లి, తనికెళ్ల, అమ్మపాలెం, చిన్నగోపతి, రెడ్డిగూడెం, కాండ్లవనం, కాచవరం, కొండవనమాల, పెద్దమునగాల తదితర గ్రామాల మీదుగా కొనసాగింది. ప్రతి గ్రామంలోనూ ప్రజలు యాత్రకు ఘన స్వాగతం పలికారు. స్థానిక సమస్యలను యాత్ర బృందం దృష్టికి తీసుకురావడంతో పాటు పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.

ధరల భారం.. పన్నుల భారం

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో భాగం హేమంతరావు మాట్లాడుతూ.. 2014 నుంచి దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. సామాన్యుడిపై పన్నుల భారం, ధరల భారం నిరంతరం పెరుగుతోందని విమర్శించారు. ప్రజల ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వ హయాంలో రాజకీయ అవినీతి తీవ్రస్థాయికి చేరిందని ఆయన ఆరోపించారు. ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మిక భావాలతో ముడిపడిన అంశాల్లోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.

నల్లధనం ఎక్కడ?

విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి దేశానికి తీసుకొచ్చి ప్రజలకు ప్రయోజనం కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని హేమంతరావు ప్రశ్నించారు. కోట్లాది రూపాయల రుణాలను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు వెళ్లి విలాసవంతమైన జీవితం గడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మరోవైపు సామాన్య ప్రజలపై మాత్రం పన్నులు, ధరల రూపంలో భారాలు మోపుతోందని మండిపడ్డారు.

మతం పేరుతో అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లింపు

మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి దేశ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హేమంతరావు ఆరోపించారు. దేశ సంపదను కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మళ్లిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, రైతులు–కార్మికుల సమస్యలు వంటి అసలు ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా.. మతం, భావోద్వేగ అంశాలను ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు.

ప్రజల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి

మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హేమంతరావు హెచ్చరించారు. ప్రజల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని.. వాటి పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎర్రబాబు, దొండపాటి రమేష్, మండల పార్టీ కార్యదర్శి గడల భాస్కరరావు, వైరా మండల పార్టీ కార్యదర్శి యామాల గోపాలరావు, తనికెళ్ల గ్రామ శాఖ కార్యదర్శి యాస వెంకటేశ్వరరావు, ఏపూరి లతాదేవి, పోటు కళావతి, సీతామహాలక్ష్మి, సింగు నరసింహారావు, కొండపర్తి గోవిందరావు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, మిడికంటి వెంకట్‌రెడ్డి, కంపసాటి వెంకన్న, ఏదులాపురం కౌన్సిలర్ శ్రీజ, సుదర్శన్‌రెడ్డి, ఆనందరావు, గొడ్డుగరుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Latest