Mahaa Daily Exclusive

  రాహుల్ గాంధీ పారిపోవద్దు, దాక్కోవద్దు..! బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు..

Share

  • రాహుల్ గాంధీ పారిపోవద్దు, దాక్కోవద్దు
  • పార్లమెంట్ లో చర్చకు రండి, వాస్తవాలను ఎదుర్కోండి
  • బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, మహా : ఢిల్లీలో రాజకీయ డ్రామాలు చేస్తూ, పార్లమెంట్ చర్చల నుంచి పారిపోవడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానాలు వినే ధైర్యం లేని ఒక ‘ఫెయిల్డ్ లీడర్ గా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్, ఇండీ కూటమి ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.

ఝార్ఖండ్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా ఇతర నియామక పరీక్షల పేపర్ లీకేజీలపై విద్యార్థులు, నిరుద్యోగ యువత గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో నిరాహార దీక్షలు, ఆందోళనలు చేస్తున్నారని రాంచందర్ రావు తెలిపారు. అక్కడ అధికారంలో ఉన్నది ఇండీ కూటమి ప్రభుత్వమే అయినప్పటికీ, పేపర్ లీకేజీలను సీబీఐకి అప్పగించాలని కోరుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్‌లు చేయిస్తూ, రబ్బర్ బుల్లెట్లతో రక్తం కారేలా అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ పోరాటానికి బిజెపి పూర్తి మద్దతు ప్రకటిస్తోందని, కానీ రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నాయకులకు ఝార్ఖండ్ విద్యార్థుల రక్తం, కన్నీళ్లు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ పేరుతో కాంగ్రెస్, ఇండీ కూటమి చేసిన ఆందోళనలో 90 శాతం మంది విద్యార్థులే కారని, అంతా బయటివారేనని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలతో ఏమాత్రం సంబంధం లేని ఎల్‌జీబీటీక్యూ వర్గాలు, దేశ వ్యతిరేక నినాదాలు చేసే మూకలు, ‘కాశ్మీర్‌కు ఆజాదీ కావాలి’ అని నినదించే శక్తులు ఆ ఆందోళనలో పాల్గొన్నాయని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను వాడుకోవడం కాంగ్రెస్‌కు అలవాటైందని దుయ్యబట్టారు. మరొకవైపు, ఢిల్లీలో నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్‌చుక్ వద్దకు కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు వెళ్లి, చర్చలు జరిపి పరిష్కారం దిశగా అడుగులు వేశారని గుర్తుచేశారు. నీట్ ఘటనలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, కేంద్రం పకడ్బందీగా చట్టాలు తీసుకువచ్చిందని గుర్తుచేశారు. మరి ఝార్ఖండ్‌లో వరుస పేపర్ లీకేజీలకు కాంగ్రెస్-ఇండీ కూటమి ప్రభుత్వం ఎందుకు నైతిక బాధ్యత వహించడం లేదని ఆయన నిలదీశారు.

అశోక్‌నగర్‌కు రండి

తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగులను ఘోరంగా మోసం చేసిందని రాంచందర్ రావు ఫైరయ్యారు. రాహుల్ గాంధీ గారూ.. మీరు తెలంగాణకు వచ్చి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ కు వచ్చి చూడండి! గత ఎన్నికల సమయంలో అక్కడికి వచ్చి జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఇచ్చిన అనేక హామీల అమలు ఏమయ్యాయో సమాధానం చెప్పండని సవాల్ విసిరారు. తెలంగాణలో నిరుద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీచార్జ్‌లు చేయిస్తుంటే, బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే ఆధ్వర్యంలో కాంగ్రెస్ మోసాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగ యువత డిమాండ్లను తెలియజేసేలా లక్షలాది సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడంతో పాటు నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తోందని రాంచందర్ రావు వెల్లడించారు.

నీట్ అంశంపై పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తిస్థాయిలో సమాధానం చెప్పడానికి, కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా చర్చించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. “రాహుల్ గాంధీ గారూ పారిపోవద్దు, దాక్కోవద్దు! రోడ్లపై డ్రామాలు మానుకుని పార్లమెంట్ చర్చకు హాజరవ్వండి. ప్రతి ప్రశ్నకు గౌరవ హోంమంత్రి గారు సమాధానం చెబుతారు” అని రాంచందర్ రావు స్పష్టం చేశారు. నిజంగా విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే.. రాహుల్ గాంధీ తక్షణమే ఝార్ఖండ్ వెళ్లి అక్కడి విద్యార్థులకు మద్దతుగా నిలబడాలని, పార్లమెంట్ వేదికగా చర్చను ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు.

Latest