- ఏడాదంతా సెలబ్రేషన్స్
- నేటి నుండి ప్రారంభం
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్రం ఏడాదంతా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రత్యేక వెబ్‌సైట్ కూడా ఏర్పాటు చేసింది . అందులో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది. నవంబర్ 26 నుంచి ఏడాది పొడవునా వేడకలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అయితే మంగళవారం పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో జరిగే 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి దౌప్రది ముర్ము అధ్యక్షత వహించనున్నట్లు తెలిపింది. మంగళవారం నుంచి ఏడాది పొడవునా జరిగే వేడుకల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో రాజ్యాంగ ప్రవేశికను సామూహికంగా చదివించే కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
నవంబర్ 26న జరిగే రాజ్యాంగ దినోత్సవం కేవలం పార్లమెంటులో జరుపుకునే వేడుక మాత్రమే కాదని, ఇది దేశం మొత్తం జరుపుకోవాల్సిన పండుగని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా అందులోని విషయాలను దేశ ప్రజల ముందుకు తీసుకువస్తున్నామన్నారు. మంగళవారం రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించనున్నట్లు కిరెన్ రిజిజు పేర్కొన్నారు.
రాజ్యాంగం ప్రవేశిక అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
మరోవైపు, రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రవేశికలో లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం కొట్టివేసింది. రాజ్యాంగ పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలను జోడిస్తూ 1976లో చేసిన 42వ సవరణను సవాల్ చేస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తదితరులు పిటిషన్లు వేశారు. ఆ సవరణపై పార్లమెంట్‌లో చర్చ జరగలేదని వాదించారు. ఎమర్జెన్సీ సమయంలో చేసిన ఆ సవరణల చట్టబద్ధతను పిటిషన్‌లో ప్రశ్నించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు నవంబర్ 22న తీర్పు రిజర్వ్ చేసి, తాజాగా ఆ పిటిషన్లను కొట్టివేసింది. ఆ పదాలకు వివిధ వివరణలున్నాయని, వేర్వేరుగా అన్వయించుకుంటున్నారని గత విచారణలో సుప్రీం అభిప్రాయపడింది. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని. సమానత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుందని తెలిపింది. దాన్ని మరో రకంగా చూడకూడదని హితవు పలికింది. సెక్యులర్ అనే పదం అంతేనని పేర్కొంది.