Mahaa Daily Exclusive

  నగరంలో మంచినీటి సరఫరా సజావుగా సాగాలి..-:జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న..

Share

  • నగరంలో మంచినీటి సరఫరా సజావుగా సాగాలి
  • లీకేజీలు, సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలి
  • జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న

వరంగల్, కార్పొరేషన్ మహా;

గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా, సక్రమంగా మంచినీటి సరఫరా జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం జీడబ్ల్యూఎంసీ క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో నగర మంచినీటి సరఫరాపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా మంచినీటి సరఫరా పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు, లీకేజీలు, పైప్‌లైన్‌ల పరిస్థితి తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.

నగరంలోని ఏ ప్రాంతంలోనైనా మంచినీటి సరఫరాలో అంతరాయం, పైప్‌లైన్ లీకేజీలు లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే వాటిని వెంటనే గుర్తించి, తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. సమస్యలను కేవలం గుర్తించడం కాకుండా, వాటి మూల కారణాలను తెలుసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.

ప్రతి డివిజన్ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, లీకేజీల నివారణ, పైప్‌లైన్‌ల నిర్వహణ తదితర పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి వారంలో నిర్వహించే సమీక్ష నాటికి ఎలాంటి లోటుపాట్లు, పెండింగ్ సమస్యలు లేకుండా అన్ని సమస్యలను పరిష్కరించి సిద్ధంగా ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు.

ప్రజలకు నాణ్యమైన మంచినీరు సక్రమంగా అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నీటి సరఫరాపై వచ్చే ఫిర్యాదులకు తక్షణ స్పందన ఉండాలని ఆయన సూచించారు.

ఈ సమీక్షలో సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంతోష్ బాబు, సంజయ్ కుమార్, రవికుమార్, డీఈలు, ఏఈలు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Latest