• పాత నిబంధనలే ప్రామాణికం.
• కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి స్పష్టమైన మార్గదర్శకాలు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రత పింఛన్ల మంజూరుపై తెలంగాణ ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. కొత్త పింఛన్ల అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు చేయలేదని వెల్లడించింది. గత ప్రభుత్వాల హయాంలో 2014 నుంచి 2018 మధ్య జారీ చేసిన సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అర్హత ప్రమాణాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ‘చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం’ కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిదశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.
ఇప్పటికే దరఖాస్తు చేసినవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు
ప్రజాపాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభలు, ప్రజావాణి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే అందిన దరఖాస్తులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. అయితే గతంలోనే దరఖాస్తు చేసి, అర్హతకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సమర్పించిన వారికి మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
గతంలో దరఖాస్తు చేసినప్పటికీ అవసరమైన పత్రాలు సమర్పించని వారు, అలాగే ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అర్హులు మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అర్హత నిర్ధారణకు అవసరమైన ధ్రువపత్రాలను సంబంధిత శాఖల నుంచి పొందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని పేర్కొంది.
వర్గాల వారీగా ధ్రువపత్రాలు
వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం అవసరం ఉంటుంది. ఒంటరి మహిళలకు విడిపోయినట్లు నిర్ధారించే ధ్రువపత్రంతో పాటు అవసరమైన సందర్భాల్లో స్థానిక విచారణ నివేదికను పరిగణనలోకి తీసుకుంటారు. గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు చేనేత–జౌళి శాఖ ధ్రువీకరణ అవసరం. ఫైలేరియా బాధితులకు వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది.
తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా సంబంధిత వైద్య ధ్రువపత్రాల ఆధారంగా అర్హతను నిర్ధారించనున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే పింఛన్ మంజూరు
దరఖాస్తుల స్వీకరణ అనంతరం సంబంధిత అధికారులు వాటిని పరిశీలిస్తారు. అవసరమైన పత్రాలు, అర్హత ప్రమాణాలను పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలోనూ లబ్ధిదారుల అర్హతను తనిఖీ చేస్తారు. ఈ పరిశీలన పూర్తయిన అనంతరం అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపిస్తారు.
జిల్లా స్థాయిలో పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ ఆమోదంతో పింఛన్ మంజూరు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పాత అర్హతలే.. కొత్త ప్రక్రియ
కొత్త పింఛన్ల కోసం అర్హత ప్రమాణాలను తాజాగా మార్చలేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేయడంతో అర్హతలపై నెలకొన్న సందేహాలకు తెరపడినట్లైంది. 2014 నుంచి 2018 మధ్య జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారమే అర్హతను పరిశీలించి, అర్హులైన వారికి సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.







