పల్నాడు ,మహా,
ఆంధ్రప్రదేశ్‌లో ప్రసవానంతర తల్లి, శిశువుల సురక్షిత రవాణాకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నరసరావుపేటలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు , జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తో కలసి 300 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఆధునిక వాహనాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ వాహనాలు దేశంలోనే తొలిసారి అత్యాధునిక భద్రతా సౌకర్యాలతో కూడినవి.మొత్తం 500 వాహనాలను ప్రభుత్వం సమకూర్చుతోంది. తొలి దశలో 300 వాహనాలను ప్రారంభించి, మిగిలిన 200 వాహనాలను రెండు నెలల్లోపు అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లాల్లో నమోదవుతున్న ప్రసవాల సంఖ్య ఆధారంగా వాహనాలను శాస్త్రీయంగా కేటాయించారు. పల్నాడు జిల్లాకు ప్రతి వాహనాలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కొత్త వాహనాలు ఎయిర్ కండిషన్డ్ ఎస్యూవీ/ఎంయూవీ తరహాలో ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు ఆరు ఎయిర్‌బ్యాగులు, వెనుక సీట్ బెల్టులు, చైల్డ్ లాక్ స్లైడింగ్ డోర్లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్పీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 80 కిమీ/గంట వేగం దాటితే స్పీడ్ అలర్ట్ వ్యవస్థ వంటి సౌకర్యాలు కల్పించారు. గర్భిణులు, బాలింతలు సులభంగా ఎక్కడానికి ప్రత్యేక ఫుట్‌రెస్టులు, హ్యాండ్రెయిల్స్ ఏర్పాటు చేశారు. వాహనంలోనే ఎస్ఓఎస్ బటన్ ఉంది. ఏదైనా సమస్య వస్తే నొక్కగానే సమాచారం నేరుగా 102 కాల్ సెంటర్‌కు చేరుతుంది. లైవ్ జీపీఎస్ ట్రాకింగ్ (ఏఐఎస్-140 ప్రమాణాలు, జీపీఎస్, నావిక్ డ్యూయల్ సాటిలైట్), డ్యూయల్ సిమ్ 4జీ కనెక్టివిటీ, ఆఫ్‌లైన్ డేటా స్టోరేజ్, బ్యాకప్ బ్యాటరీ, మొబైల్ ఛార్జింగ్ పోర్టులు, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. నవజాత శిశువులకు అనుకూలమైన ఉష్ణోగ్రత నియంత్రణ ఏసీ వసతి కూడా కల్పించారు. ప్రయాణ సమయంలో వాహనంలోని ఆడియో సిస్టమ్ ద్వారా తల్లిపాలు, నవజాత సంరక్షణ, పోషణ, టీకాలు, ప్రసవానంతర జాగ్రత్తలపై ప్రభుత్వ సూచనలు నిరంతరం వినిపిస్తాయి అని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లి, శిశువుకు మాత్రమే ఈ డ్రాప్-బ్యాక్ సేవ ఉచితం. తల్లి, బిడ్డతో పాటు ఇద్దరు అటెండెంట్లు ప్రయాణించవచ్చు. హైరిస్క్ గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో రక్తమార్పిడి అవసరమైనవారికి ప్రత్యేక పికప్, డ్రాప్-బ్యాక్ సేవలు అందుతాయి. రాష్ట్రంలో ఏ ఫోన్ నుంచైనా టోల్ ఫ్రీ 102కు కాల్ చేస్తే హై రిస్క్ గర్భిణీలకు మెరుగైన వైద్య రవాణా సౌకర్యం కల్పించబడుతుందన్నారు. 2026-27కి రూ.37.40 కోట్ల బడ్జెట్ కేటాయించారు. మాతా, శిశు మరణాలు తగ్గించడం, ప్రసవానంతర సంరక్షణను మెరుగుపరచడం, హైరిస్క్ గర్భిణులకు సకాలంలో రవాణా అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. 108 సేవల్లో మొత్తం 733 వాహనాలు. 170 అడ్వాన్స్డ్ సిస్టమ్ వాహనాలు ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీకి గత ప్రభుత్వం రూ.2,500 కోట్ల బకాయిలు పెట్టిందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ఎన్టీఆర్ వైద్యసేవల పథకానికి రెండేళ్లలో రూ.7 వేల కోట్లు.. 29 లక్షల మంది లబ్ధి పొందారు అన్నారు. తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్ల నియామకం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 90 శాతం హామీలు పూర్తి చేశామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ లింగంగుంట్ల ఏరియా ఆసుపత్రిను జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని, 200 పడకల ఆసుపత్రిలో రోజుకు 700–1000 వరకు ఓపీ. వైద్య సేవలను మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. పల్నాడు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు లింగంగుంట్ల ఆసుపత్రిలో MCH బ్లాక్ ఏర్పాటు చేయాలి. రెండు ఎకరాల స్థలంలో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను ఎమ్మెల్యే అరవిందబాబు కోరారు. లింగంగుంట్ల జిల్లా ఆసుపత్రికి ఆపరేషన్ థియేటర్, CT స్కాన్, రేడియాలజిస్ట్ వంటి అదనపు సౌకర్యాలు కల్పించాలి.. వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కి ఎమ్మెల్యే విజ్ఞప్తిచేశారు. పల్నాడు జిల్లా కేంద్ర ప్రాంతంలో ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు చేస్తే జిల్లా ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరం.. రెండేళ్లుగా MCH బ్లాక్ కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నానన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. లింగంగుంట్ల జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్న వైద్యులు, ఎఎన్ఎం లు, అంగన్వాడీ, ఆశా, నర్సింగ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతం కావడంపై ఎమ్మెల్యే అరవిందబాబు ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య కమిషనర్ చక్రధర బాబు మాట్లాడుతూ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున పల్నాడులో మాతృ మరణాలు లేకుండా 100% కృషి చేస్తామని ,ప్రెగ్నెంట్ లేడీస్ కి హైరిస్కు లేడీస్ కి సేఫ్ డెలివరీకి జాగ్రత్తగా మ్యాప్ చేసి ప్లాన్ చేస్తామని, టీనేజ్ ప్రెగ్నెన్సీ రాకుండా చూస్తామని ఒకవేళ ఎక్కడైనా యాక్సిడెంట్ గా వస్తే వాటిని 100% సెక్యూరిటీ డెలివరీ చేస్తాం అని తెలిపారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ అండ్ పేషెంట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేస్తామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆసుపత్రి సూప రిoటెండెంట్ డాక్టర్ సతీష్ బాబు మాట్లాడుతూ ప్రారంభ కార్యక్రమం ఎక్కడైనా దొరకడం నిజంగా గొప్ప విషయం అని దానికి జాతీయ స్థాయిలో అత్యంత కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కుమార్ యాదవ్ , ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తి మేరకు అంగీకరించడం , ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇక్కడికి రావడం శుభ పరిణామం అని అన్నారు.,నాకు వృత్తిపరంగా 21 ఏళ్ల అనుభవం ఉందని, ఈ సంవత్సరం ఆసుపత్రి ఓపి 28% పెరగడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్, నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగ తరపు సుబ్బరాయ గుప్తా , జనసేన నాయకులు గాది వెంకటేశ్వర్లు, డిఎంహెచ్ఓ డాక్టర్ రత్న మన్మోహన్ , డి ఐ ఓ హనుమనాయక్ ఏవో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.








