Mahaa Daily Exclusive

  పాన్‌ మసాలా ప్యాకింగ్‌లో ప్లాస్టిక్‌కు నో..

Share

• కాగితం, సహజ పదార్థాలకే అనుమతి.
• తక్షణమే అమల్లోకి కొత్త నిబంధనలు.
ఢిల్లీ, మహా.
పాన్‌ మసాలా తయారీ, ప్యాకింగ్‌, విక్రయాలకు సంబంధించి భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ కీలక నిబంధనలు తీసుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాన్‌ మసాలా ప్యాకింగ్‌లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు తుది నిబంధనలతో కూడిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచే కొత్త నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఇకపై పాన్‌ మసాలా ప్యాకింగ్‌కు కాగితం, పేపర్‌ బోర్డు, సెల్యులోజ్‌తో పాటు సహజసిద్ధంగా లభించే పదార్థాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. పాలిథిలిన్‌, పాలిప్రొపైలిన్‌, పాలిస్టర్‌, పాలీవినైల్‌ క్లోరైడ్‌ వంటి ప్లాస్టిక్‌, కృత్రిమ పాలిమర్లతో పాటు వివిధ రకాల పొరలతో కూడిన ప్యాకింగ్‌ పదార్థాల వినియోగానికి అనుమతి ఉండదు.

అల్యూమినియం రేకుపైనా నిషేధం

ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌తో పాటు అల్యూమినియం రేకు, ఇతర లోహపు పొరలతో కూడిన ప్యాకింగ్‌ను కూడా ఉపయోగించరాదని నిబంధనల్లో స్పష్టం చేశారు. పాన్‌ మసాలా ప్యాకింగ్‌ పూర్తిగా ప్లాస్టిక్‌ రహితంగా ఉండేలా కొత్త నిబంధనలను రూపొందించారు.

అయితే కాగితపు కవర్లతో పాటు టిన్‌ డబ్బాలు, గాజు సీసాలు లేదా ఇతర గాజు పాత్రల్లో పాన్‌ మసాలాను ప్యాక్‌ చేసి విక్రయించేందుకు అనుమతి ఉంటుంది. ప్యాకింగ్‌ ప్రక్రియ పర్యావరణ పరిరక్షణ చట్టం పరిధిలోని ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

ముసాయిదా నుంచి తుది నిబంధనల వరకు

పాన్‌ మసాలా ప్యాకింగ్‌కు సంబంధించి ప్లాస్టిక్‌ వినియోగంపై కొత్త నిబంధనలను రూపొందిస్తూ ఆహార భద్రతా ప్రాధికార సంస్థ గతంలో ముసాయిదాను విడుదల చేసింది. ఏప్రిల్‌ 28న ముసాయిదా నిబంధనలను ప్రజల ముందుంచి, ప్రజలు, వ్యాపారులు, సంబంధిత వర్గాల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది.

వివిధ వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం తుది నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో తుది నిబంధనలను గెజిట్‌లో ప్రచురించారు.

తక్షణమే అమల్లోకి

కొత్త నిబంధనలకు ఎలాంటి ప్రత్యేక గడువు ఇవ్వలేదు. గెజిట్‌లో నోటిఫికేషన్‌ ప్రచురితమైన రోజునుంచే ఇవి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. దీంతో పాన్‌ మసాలా తయారీ, ప్యాకింగ్‌, విక్రయ రంగాల్లో ఉన్న సంస్థలు ఇకపై కొత్త ప్యాకింగ్‌ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించడం, పర్యావరణంపై వాటి ప్రభావాన్ని నియంత్రించడం, ప్యాకింగ్‌ విషయంలో సురక్షితమైన ప్రత్యామ్నాయ పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. కొత్త నిబంధనల అమలుతో పాన్‌ మసాలా ప్యాకింగ్‌ రంగంలో ప్లాస్టిక్‌, లోహపు పొరల వినియోగానికి గణనీయంగా అడ్డుకట్ట పడనుంది.

Latest