- లగచర్ల రైతులు ఈ ప్రభుత్వంపై తిరగబడ్డారు
- రైతులతో పెట్టుకుంటే బాగుపడ్డోడు లేడు
- మానుకోట ధర్నాలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
మహబూబాబాద్ : లగచర్లలో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ ముఖ్యమంత్రి మీద తిరగబడ్డారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వారి భూములను తీసుకుంటామని చెబుతే మా ఆడబిడ్డలు 9 నెలల పాటు ధర్నా చేసి నిరసన తెలిపారని అన్నారు. 9 నెలలుగా సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం లేదని విమర్శించారు. . గిరిజన, దళిత, పేద రైతులకు మద్దతుగా మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ముఖ్యమంత్రికి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా 28 సార్లు ఢిల్లీకి పోయిండు.. కనీసం 28 పైసలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు. మొన్న అధికారులు పోతే ప్రజలు నిరసన తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి, ఉరికించి కొట్టేవారని అన్నారు. ఎందుకంటే ఢిల్లీలో రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి మోడీ లాంటి వ్యక్తినే నల్ల చట్టాల నుంచి వెనక్కి తగ్గేలా చేశారని గుర్తుచేశారు. రైతుల పవర్ అంటే ఆ విధంగా ఉంటుందని.. అలాంటి పవర్ ఉన్న రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని మండిపడ్డారు. తాను ఇక్కడకు వస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామని అంటున్నారని కేటీఆర్ తెలిపారు. తాను డీజీపీ, ఎస్సీ గారిని అడుగుతున్నా.. రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులు మా మీద మాత్రమే పెడుతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు ఉండవా? అని నిలదీశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కలపల్లి రవీందర్రావు, మధుసూదన్ చారి, ఎమ్మెల్యేలు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి కౌశిక్ రెడ్డి,ఎంపీ వద్దు రాజు రవిచంద్ర.మాజీ ఎమ్మెల్యేలు డి ఎస్ రెడ్యా నాయక్,బానోతు శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, బానోతు హరిప్రియ, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్. బిఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మానుకోట మున్సిపాలిటీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి. వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, సొసైటీ చైర్మన్ నాయని రంజిత్, యాళ్ల మురళీధర్ రెడ్డి, పర్కాలశ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.