• అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలి.
• పెట్టుబడుల పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలి.
• సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్, మహా:
తెలంగాణలో మరిన్ని భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో డిసెంబరులో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా నిలబెట్టేలా సమ్మిట్ నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు.
పారిశ్రామిక, వ్యాపార రంగాల్లోని వివిధ విభాగాల్లో విశేష గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్ సందర్భంగా సత్కరించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపార రంగ ప్రతినిధులు పాల్గొనేలా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న సంస్థలకు రాష్ట్రంలోని అవకాశాలను సమర్థంగా వివరించేలా సమ్మిట్ కార్యక్రమాలను రూపొందించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా వేదిక, సమావేశాలు, పెట్టుబడిదారులతో చర్చలు, రంగాల వారీగా ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలు, మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను ప్రపంచానికి చాటిచెప్పేలా సమ్మిట్‌ను నిర్వహించాలని సూచించారు.
గత సమ్మిట్ పెట్టుబడులపై పూర్తి వివరాలు
గత ఏడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా సంస్థలు ప్రకటించిన పెట్టుబడుల్లో ఇప్పటివరకు ఎంత మేర కార్యరూపం దాల్చింది, ఎన్ని సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి, ఎన్ని ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి, ఎంత మేర ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి వంటి వివరాలను సమగ్రంగా నివేదించాలని సూచించారు.
ప్రకటించిన పెట్టుబడులను వాస్తవ ప్రాజెక్టులుగా మార్చే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పురోగతిని సమీక్షించడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు మరింత సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.
పెట్టుబడుల కోసం కొత్త ప్రణాళికలు
రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా పెంచేందుకు రంగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు వేగంగా అనుమతులు, అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం అందేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
సమ్మిట్ కేవలం పెట్టుబడుల ప్రకటనలకే పరిమితం కాకుండా.. అవి వాస్తవ రూపం దాల్చేలా అనుసంధాన వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక విస్తరణ, ఉపాధి కల్పనకు ఈ సదస్సును కీలక వేదికగా ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు.
సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







