Mahaa Daily Exclusive

  రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సాగునీటి ప్రణాళిక..! పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్‌ది మాటల గారడీ వనపర్తిలో మంత్రి జూపల్లి కృష్ణారావు..

Share

•రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా సాగునీటి ప్రణాళిక

•ఎల్ లినో ప్ర‌భావం – ఆరుతడి పంటలే మేలు

•బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణకు నీటి అన్యాయం

•పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్‌ది మాటల గారడీ

•వనపర్తిలో మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి, మహా : ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల కింద ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వనపర్తి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సాగునీటి పారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిలాసాగర్, ఆర్డీఎస్‌, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల జలాశయాల్లో నీటి లభ్యత, నీటి విడుదల, పంటల సాగు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అయితే కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు కురవడంతో జూరాలకు కొంతమేర నీరు వచ్చిందని, ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టులోనూ నీటి నిల్వలు పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు డిసెంబరు వరకు నీటిని అందించాల్సి ఉందన్నారు. మళ్లీ వర్షాలు కురిస్తే తప్ప ఖరీఫ్‌ సీజన్‌కు పూర్తిస్థాయిలో సాగునీరు అందించే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటి శాఖ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలించి రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం మంచిదని సూచించారు. బోర్లు, బావులపై ఆధారపడే రైతులు కొంతమేర వరి సాగు చేసినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని, అయితే ప్రాజెక్టు కాలువల ద్వారా సాగు చేసే రైతులు మాత్రం ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.

జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం సుమారు 9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని మంత్రి తెలిపారు. ఇందులో 7 టీఎంసీలను సాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉండగా, మరో 2 టీఎంసీలను తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ నాగార్జునసాగర్‌తో పాటు ఇతర ప్రాజెక్టులకు కూడా నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని ఆరుతడి పంటలు సాగు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణకు నికర జలాల కేటాయింపులు సాధించలేదని మంత్రి జూపల్లి విమర్శించారు. రూ.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేసి, ప్రాజెక్టు పూర్తయిందంటూ జాతికి అంకితం చేసినట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఉన్న నీటి హక్కులను సైతం ఆంధ్రప్రదేశ్‌కు అప్పనంగా అప్పగించారని విమర్శించారు. 68.5:31.5 నిష్పత్తిలో 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 512 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 299 టీఎంసీలు రావాల్సి ఉండగా.. గత ప్రభుత్వం తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను సరిగా వినియోగించుకోలేకపోయిందని ఆరోపించారు. ఎవరు ఎవరికి అన్యాయం చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్‌ నేతలపై మండిపడ్డారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కుర్చీ వేసుకుని రెండేళ్లలో పూర్తి చేసి తీరుతామని అప్పట్లో చెప్పిన కేసీఆర్‌.. 2014 నుంచి 2022 వరకు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను కూడా సమర్పించలేదని మంత్రి జూపల్లి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, వాటికి శ్రీకారం చుట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సుమారు రూ.8,300 కోట్లు నిధులు వెచ్చించిందన్నారు. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం సుమారు రూ.6 వేల కోట్లు ఖర్చు చేసి మొత్తం ప్రాజెక్టులను తామే పూర్తి చేశామని చెప్పుకోవడం వాస్తవాలను వక్రీకరించడమేనని మంత్రి జూపల్లి అన్నారు. రైతులకు వాస్తవాలు తెలియజేసి, సాగునీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగుపై సూచనలు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Latest