Mahaa Daily Exclusive

  రాష్ట్రంలో ఆ నలుగురిదే పాలన..! భూదందా, లక్షల కోట్ల అవినీతిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్..

Share

•భూదందా, లక్షల కోట్ల అవినీతిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్

•భూ లావాదేవీలు, 22ఏ అక్రమాలపై సీబీఐ లేదా ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్

•ఆధారాలతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నానని మంత్రి శ్రీధర్ బాబుకు సవాల్

హైదరాబాద్, మహా : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ కుంభకోణాలు, అవినీతి అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయని బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కేవలం నలుగురు మంత్రులు, నలుగురు గుత్తేదారుల చేతుల్లోనే పాలన నలిగిపోతోందని, మరోవైపు ‘భూ భారతి’ పేరుతో వచ్చి ప్రస్తుతం ‘భూహారతి’ పేరుతో భూదందాలు సాగిస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించి, బాధ్యులను జైలుకు పంపుతామని, లక్షల కోట్ల రూపాయలు కక్కిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు ఆ ఫోరెన్సిక్ ఆడిట్ వివరాలను ఎందుకు పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ ఆడిట్ పేరుతో గత ప్రభుత్వ నేతలను బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్ టాక్టిక్స్ ఉపయోగిస్తూ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో సెక్షన్ 22ఏ (నిషేధిత జాబితా) ను అడ్డుపెట్టుకుని పేద రైతులు, ప్రైవేట్ భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. గతంలో 10 శాతంగా ఉన్న 22ఏ భూముల విస్తీర్ణం, ఇప్పుడు 30 నుండి 40 శాతానికి పెరిగి కోటి ఎకరాలకు చేరుకుందని వెల్లడించారు. రైతులకు చెందిన భూములను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో చేర్చి, మంత్రికి 40 శాతం ముడుపులు చెల్లిస్తేనే ఆ జాబితా నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం కోర్టుకు సైతం అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఫారెస్ట్ భూముల కన్సాలిడేటెడ్ వివరాలను సమర్పించకుండా దాచేస్తోందని మండిపడ్డారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గతంలో అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తూ రాష్ట్రంలో రూ.2.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఒక్క ఎకరం భూమిని కూడా ఎందుకు వాపస్ తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న చీకటి ఒప్పందాల వల్లే ఈ భూములను వదిలేస్తున్నారని ఆరోపించారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(ఏ) ప్రకారం ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రిగా పదవిలో ఉంటూ తన కుటుంబానికి చెందిన కంపెనీలకు పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టులు కట్టబెట్టుకోవడమే కాకుండా, రీ-ఎస్టిమేషన్ పేరుతో అంచనా వ్యయాన్ని రూ.1,450 కోట్ల నుంచి రూ.4,350 కోట్లకు పెంచుకున్నారని పేర్కొన్నారు. అలాగే నాదర్‌గుల్, వట్టినాగులపల్లి భూముల ఆక్రమణలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైటెక్ సిటీలో రూ.1,500 కోట్ల విలువైన 12 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, కొండాపూర్‌లో రూ.1,600 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల విలువైన 41 ఎకరాల భూమి ఫినిక్స్ కంపెనీ నుంచి మంత్రి కుటుంబ కంపెనీలకు ఎలా బదిలీ అయ్యాయో బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వానికి బినామీగా ఉన్న సంస్థలు ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు బినామీలుగా మారాయని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న భూ లావాదేవీలపై, 22ఏ అక్రమాలపై సీబీఐ లేదా ఈడీ చేత విచారణ జరిపించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధారాలు అడుగుతున్నారని, తాను ఆధారాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లోగానీ, లేదా ఏదైనా ఛానెల్ స్టూడియోలోగానీ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Latest