Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్ సీరియస్..! రూ. 13,399 కోట్ల ‘సీఎంఆర్’ కుంభకోణం..

Share

• రూ. 13,399 కోట్ల ‘సీఎంఆర్’ కుంభకోణం.
• డిఫాల్ట్ మిల్లుల జప్తు.
• ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తారా.
• జప్తు చేసిన మిల్లులన్నీ నేరుగా మహిళా సంఘాలకే.

హైదరాబాద్, మహా.

తెలంగాణ పౌరసరఫరాల వ్యవస్థలో దశాబ్దాలుగా పాతుకుపోయిన అవినీతి కుళ్లును కడిగేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమరశంఖం పూరించింది. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ పేరుతో ఏకంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన బడా మిల్లర్ల బాగోతంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కన్నెర్రజేశారు. రైతుల చెమట చుక్కలతో పండిన ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి మిల్లింగ్ కోసం ఇస్తే, ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించి కోట్లు గడిస్తున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు సర్కారు సన్నద్ధమైంది. ప్రభుత్వ బియ్యాన్ని దొడ్డిదారిన అమ్ముకుంటూ, పైగా ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్ చేస్తున్న డిఫాల్ట్ మిల్లర్ల ఆటలు ఇక తెలంగాణ గడ్డపై సాగవని ముఖ్యమంత్రి అత్యంత కఠినంగా హెచ్చరించారు. వేల కోట్ల బకాయిలు చెల్లించని మిల్లులను తక్షణమే స్వాధీనం చేసుకుని, వాటి యాజమాన్య హక్కులను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలన్న విప్లవాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

**జిల్లాల వారీగా అల్లుకున్న రైస్ మిల్లింగ్ మాఫియా**

రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా, అనధికారికంగా కలిపి సుమారు 2,500కు పైగా రైస్ మిల్లులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ (మిర్యాలగూడ), సూర్యాపేట, పెద్దపల్లి వంటి ప్రధాన ధాన్యాగార జిల్లాల్లోనే అత్యధికంగా మిల్లులు కేంద్రీకృతమయ్యాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే సుమారు 360కి పైగా మిల్లులు ఉండగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో వందల సంఖ్యలో పారా బాయిల్డ్, రా రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ జిల్లాల కేంద్రంగానే అతిపెద్ద సీఎంఆర్ మాఫియా దశాబ్దాలుగా రాజ్యమేలుతోంది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మరపట్టి తిరిగి ఎఫ్‌సీఐ , పౌరసరఫరాల శాఖకు ఇవ్వాల్సిన మిల్లర్లు, ఆ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారు. తీరా ప్రభుత్వం లెక్కలు అడిగేసరికి రకరకాల కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు.

**రికార్డులు బద్దలు కొట్టిన బాగోతం.. ఏకంగా రూ.13,399 కోట్లు**

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన సీఎంఆర్ అవకతవకల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఉన్నతాధికారుల తాజా అంతర్గత నివేదికల ఆధారంగా వెలుగులోకి వచ్చిన వాస్తవాలు అక్షరాలా రూ.13,399 కోట్ల కుంభకోణాన్ని బట్టబయలు చేస్తున్నాయి. దాదాపు 59.96 లక్షల టన్నుల బియ్యం లెక్కల్లోకి రాకుండా పక్కదారి పట్టిందంటే ఈ జిల్లాల్లోని మిల్లింగ్ మాఫియా ఏ స్థాయిలో చెలరేగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. గత పదేళ్ల కాలంలో జరిగిన ఈ భారీ దోపిడీలో (బీఆర్ఎస్ హయాంలో రూ.11,304 కోట్లు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రూ.2,095 కోట్లు) ప్రభుత్వం ఇప్పటికే కొంతమేర రికవరీ చేసినప్పటికీ, ఇంకా ఏకంగా 28.22 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని డిఫాల్ట్ మిల్లర్ల నుంచి సర్కారు ముక్కుపిండి వసూలు చేయాల్సి ఉంది. దీని విలువే సుమారు రూ.6,630 కోట్లకు పైగా ఉంటుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తేల్చారు.

**సీఎం రేవంత్ సీరియస్**

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ఉగ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణం మిల్లర్ల వ్యవహారశైలి, వారి బ్లాక్‌మెయిల్ పర్వమే! రైతుల నుంచి కొన్న ప్రభుత్వ ధాన్యానికి మిల్లర్లు కేవలం సంరక్షకులు మాత్రమే. కానీ వారు దానిని తమ సొంత జాగీరులా భావించి ఇతర వ్యాపారాలకు మళ్లించారు. నిజామాబాద్ లాంటి జిల్లాల్లో రోజుకు 6,000 టన్నుల సామర్థ్యం ఉన్నా ఉద్దేశపూర్వకంగా 2,000 టన్నులే మిల్లింగ్ చేస్తూ వ్యవస్థను ఇరకాటంలో పెట్టారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే ఏకంగా నకిలీ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వాన్నే మోసం చేశారు. అధికారులను రంగంలోకి దించి రికవరీకి వెళ్తే, ఎదురు తిరిగి కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి మిల్లర్లు దిగజారారు. ఈ అహంకార పూరిత, బ్లాక్‌మెయిల్ ధోరణిని గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “ప్రభుత్వ ధాన్యాన్ని తిని, తిరిగి ఇవ్వకుండా ఎదురుదాడికి దిగే మిల్లర్ల ఆటలు ఇక సాగవు. ఉద్దేశపూర్వక డిఫాల్టర్లకు ఇక ధాన్యం కేటాయింపు ఉండదు. వారి ఆస్తులను జప్తు చేయండి. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేయండి” అని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

**మహిళా సంఘాల చేతికి రైస్ మిల్లులు**

మిల్లర్ల మెడలు వంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన తాజా స్కెచ్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. డిఫాల్ట్ మిల్లులను జప్తు చేయడమే కాకుండా, ఆ మిల్లుల నిర్వహణను నేరుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) అప్పగించాలన్నది సర్కార్ మాస్టర్ ప్లాన్. ఒకవైపు బకాయి పడిన మిల్లులపై కొరడా ఝుళిపించడం, మరోవైపు అదే మౌలిక సదుపాయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం అనే ద్వంద్వ లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 553 మండల సమాఖ్యల ద్వారా 553 మిల్లుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం కాగా, ఇప్పుడు ఈ జప్తు చేసిన డిఫాల్టర్ల ఆస్తులను కూడా మహిళా సంఘాలకు అనుసంధానం చేయనున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు నుంచి మిల్లింగ్, ఎఫ్‌సీఐకి సరఫరా వరకు మొత్తం విలువ శృంఖలంలో తెలంగాణ మహిళలు అత్యంత కీలక భాగస్వాములుగా మారబోతున్నారు.

**కటకటాల వెనక్కి అక్రమార్కులు**

ప్రభుత్వం ఈసారి కేవలం నోటీసులకే పరిమితం కాలేదు. నేరుగా రెవెన్యూ రికవరీ చట్టం (RR Act) ప్రయోగించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో ఏడుగురు మిల్లర్లపై కేసులు నమోదు చేసి, సుమారు రూ.490 కోట్ల బకాయిల వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వ చర్యలను తట్టుకోలేక సుమారు 300 మందికి పైగా మిల్లర్లు హైకోర్టును ఆశ్రయించినా, సర్కారు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ధాన్యం నాణ్యత బాగోలేదని ఇప్పుడు కోర్టులో సాకులు చెబుతున్న మిల్లర్లు, ధాన్యం తీసుకునేటప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు దీటుగా బదులిస్తున్నారు. ఒకవైపు రికార్డు స్థాయిలో పండుతున్న ఖరీఫ్ ధాన్యం సకాలంలో ఎఫ్‌సీఐ గోదాములకు చేరాలంటే పటిష్టమైన వ్యవస్థ ఉండాలి, మరోవైపు మిల్లింగ్ మాఫియాను కట్టడి చేయాలి. ఈ క్లిష్ట సమయంలో సిండికేట్‌గా మారి ఏకంగా ప్రభుత్వాన్నే శాసించాలనుకున్న రైస్ మిల్లర్ల సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పెకిలించేందుకు రేవంత్ సర్కార్ సన్నద్ధమైంది. ప్రజాధనాన్ని లూటీ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని సర్కారు తీసుకున్న తాజా నిర్ణయాలు, తెలంగాణ పౌరసరఫరాల చరిత్రలో పెను మార్పులకు నాంది పలుకుతున్నాయి!

Latest