Mahaa Daily Exclusive

  రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్..! స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

Share

•రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్

•అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

•ఐదు కాన్సెప్టులతో దేశం మెచ్చిన రాజధానిగా అమరావతి

•స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

•రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయం పరిశీలన

అమరావతి, ఆగస్టు 13:మహా

సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటు అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో, అమరావతి నిర్మాణంలో ఇది మొదటి మెట్టు అని సీఎం స్పష్టం చేశారు. ఉండవల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ – మంగళగిరి – గుంటూరులతో కలిపే కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రహదారిని అనుసంధానించేలా బకింగ్ హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను కూడా సీఎం ప్రారంభించారు. వీటి ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు పి.నారాయణ, నాదెండ్ల మనోహర్‌లతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాయపూడి నుంచి వెంకటపాలెం- పెనుమాక మీదుగా ఉండవల్లి వరకూ సీడ్ యాక్సెస్ రహదారిని సీఆర్డీఏ నిర్మించింది. స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించటంతో రాజధాని నగరానికి మెరుగైన కనెక్టివిటీ వచ్చినట్టైంది. మూడో దశలో మణిపాల్ ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారి 16కు అనుసంధానించేలా ప్రణాళిక చేశారు. దీనికి రూ.1,519 కోట్ల వ్యయం కానుంది. స్టీల్ బ్రిడ్జిలతో పాటు సీడ్ యాక్సెస్ రహదారిని సీఎం కాలినడకన తిరిగి ఆసాంతం పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ… “రాష్ట్రాభివృద్ధి విజన్‌కు అమరావతి నగర నిర్మాణం మొట్టమొదటి సక్సెస్. తెలుగు జాతి గర్వపడేలా ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం జరిగింది. విభజన తర్వాత రాష్ట్రం నష్ట పోయింది. రాజధాని కూడా లేకుండా పోయింది. 25 పార్లమెంటు స్థానాల్లో మధ్యలో ఉన్న గుంటూరు జిల్లాలో రాజధాని పెట్టాలని ఆనాడు సంకల్పించాం. విస్తృత చర్చల తర్వాత మాపై విశ్వాసంతో రైతులుట్లు రాజధాని నిర్మాణం కోసం ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. రైతులది త్యాగం కాదు స్పూర్తి. సింగపూర్ అమరావతి బృహత్ ప్రణాళికను ఉచితంగా ఇచ్చి సహకరించింది. గత పాలకులు ప్రజలతో పాటు సింగపూర్‌ ప్రతినిధులను కూడా వేధింపులకు గురిచేశారు. ప్రభుత్వ కాంప్లెక్సు భవనాలు ప్రత్యేకంగా ఉండాలని ప్రముఖ ఆర్కిటెక్టులతో డిజైన్లు చేయించాం. కొందరు గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేశారు. ఆ గ్రాఫిక్స్ నిజం అవుతుంటే ఎగతాళి చేసిన వాళ్లంతా తలలు దించుకోవాలి. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి వికేంద్రీకరించేలా ప్రణాళికలు చేశాం. అసెంబ్లీలో రాజధాని 40 వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి తర్వాత మూడు రాజధానులని మాట తిప్పేశాడు. 2019-24 మద్య రైతుల ఉద్యమాన్ని చరిత్ర మర్చిపోదు. అమరావతితో పాటు రాష్ట్రం అంతటా అభివృద్ధి కావాలన్నదే నా ఆకాంక్ష. అమరావతిని ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. “అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

*రాజధాని నిర్మాణంలో ఐదు కాన్సెప్టులు*

“అమరావతి రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చేసింది. నగర నిర్మాణంలో ఇది ప్రారంభం మాత్రమే. మూడో దశలో ఇది తాడేపల్లి వద్ద జాతీయ రహదారికి కనెక్టు అవుతుంది. అమరావతి రాజధాని పూర్తి కాలుష్య రహిత నగరంగా మారుతుంది. డీప్‌టెక్ క్యాపిటల్ గా దీనిని తయారు చేస్తున్నాం. ఐదు ముఖ్యమైన అంశాలతో రాజధాని నిర్మాణం చేపడుతున్నాం. నో పోల్స్, బ్లూ, గ్రీన్, గ్రీన్ ఎనర్జీ, క్వాంటం డీప్ టెక్ లాంటి ఐదు కాన్సెప్టులతో నిర్మాణం జరుగుతోంది. ఏఐ, క్వాంటం కంప్యూటర్ వ్యాలీగా అమరావతి మారుతుంది. టాప్ 5 నగరాల్లో ఒకటిగా తయారవుతుంది
అమరావతి, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు రాజధాని పరిధిలోనే ఉంటాయి. 190 కిలోమీటర్ల అవుటర్, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగురోడ్డు మంజూరు చేసిన కేంద్రానికి ధన్యవాదాలు. 2028 నాటికి భారత్ మెచ్చిన రాజధానిగా అమరావతిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సింధూ నాగరికత తరహాలోనే రాజధాని నగరంలో సీడ్ యాక్సెస్ రహదారులు నిర్మాణం జరుగుతున్నాయి. ఇక అమరావతి అన్ స్టాపబుల్. రాజధాని లో నిర్మిస్తున్న రోడ్డును అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ తరహా వ్యక్తులతో రాష్ట్రానికి చాలా ప్రమాదం. రాష్ట్రాభివృద్ధి కోసం నిర్దుష్టమైన లక్ష్యాలను పెట్టుకుంటున్నాం”. అని సీఎం అన్నారు.

*జెండా- సాధించాల్సిన అజెండాతో సంకల్పం*

“2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్ర చేయాలన్న సంకల్పం తీసుకున్నాం. ప్రజలు వ్యక్తులుగా మీరేం సంకల్పం తీసుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చేతిలో జాతీయ జెండా, మనస్సులో అజెండాతో సాధించాల్సిన లక్ష్యాన్ని సంకల్పం చేయండి. అనునిత్యం మీ సంకల్పాన్ని నెరవేర్చుకునే ఆలోచనలు చేస్తే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యం అవుతుంది. మనకు స్వాతంత్య్రం ఎందుకు వచ్చిందన్న అంశాన్ని అంతా మర్చిపోతున్నాం. జెండా వందనంతో పాటు దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేలా ఆలోచనలు చేయటం ముఖ్యం. రైతులు, విద్యార్ధులు, కార్మికులు, వ్యాపారులు ఎవరైనా తమ తమ స్థాయిల్లో కృషి చేయాలి. ప్రతీ ఇల్లు, వాణిజ్య సంస్థ పైనా జాతీయ జెండా ఎగరాలి. మండల, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించాలి. ఓ ప్రజా ఉద్యమంగా తిరంగా ర్యాలీ జరగాలి. వచ్చే 21 ఏళ్లలో వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర కల సాకారం కావాలి. ఆ శక్తి సామర్ధ్యాలను ప్రజలే అందించాలి. అమరావతి రాజధాని అభివృద్దికి ప్రజలూ ఆలోచనలు పంచుకోవాలి. అమరావతి ఆర్దిక రాజధానిగా ఎదగాలి. “అని సీఎం అన్నారు. అనంతరం మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణలతో కలిసి రాయపూడి వద్ద నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని సీఎం పరిశీలించారు.

Latest