- కాళేశ్వరంపై డీఈ, ఈఈలను విచారించిన కమిషన్
హైదరాబాద్, మహా : సుందిళ్ల బ్యారేజీలోని 2 ఏ బ్లాకును డిజైన్ లేకుండానే నిర్మాణం ప్రారంభించినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇంజనీర్లు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు మంగళవారం 16 మంది క్షేత్రస్థాయి ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ వారిని ప్రశ్నించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డీఈ, ఏఈఈలను జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. పనులు, డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నించారు. రెండో బ్లాక్‌ను పరిగణలోకి తీసుకొని సుందిళ్ల బ్యారేజీని 2ఏ బ్లాకు నిర్మాణాన్ని డిజైన్ లేకుండానే ప్రారంభించినట్లు ఇంజనీర్లు తెలిపారు. అప్పటి చీఫ్ ఇంజినీర్ ఆదేశాల మేరకు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. డిజైన్లు లేకుండా పనులు ఎలా చేపడతారని జస్టిస్ పీసీ ఘోష్ అడగ్గా కొందరు ఇంజినీర్ల సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసి కమిషన్ తప్పుదోవ పట్టించవద్దని స్పష్టం చేసింది. అఫిడవిట్‌లో ఒక సమాచారం, విచారణలో మరొక సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విచారణలో ప్రమాణం చేసి అబద్ధం ఎలా చెబుతారని మండిపడ్డారు. అలా చేస్తే చర్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని హెచ్చరించారు. పనులకు సంబంధించిన ప్లేస్ మెంట్ రిజిస్టర్లు, మెజర్ మెంట్ బుక్స్‌పై ఇంజినీర్ల సంతకాలు తీసుకున్న కమిషన్ వాటిని స్వాధీనం చేసుకుంది. బుధవారం మరో 18మంది ఇంజినీర్లను కమిషన్ విచారణ చేయనుంది. గత నెల జరిగిన విచారణలో కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ పునాది ర్యాఫ్ట్ కింద ఇసుక కదలడంతోనే నష్టం జరిగి ఉంటుందని నీటి పారుదల శాఖ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓ అండ్ ఎమ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ బి. నాగేంద్రరావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు జస్టిస్ పీసీ ఘెష్ కమిషన్ ముందు ఈఎన్సీ నాగేందర్‌రావు, సీఈ అజయ్ కుమార్, ఇంజనీర్ ఓంకార్ సింగ్ హాజరయ్యారు. ఆనకట్టల నాణ్యత, నిర్వహణ, డ్యాం సేఫ్టీ నిబంధనల అమలు గురించి జస్టిస్ పీసీ ఘోష్ వారిని విచారించారు.