వర్ధన్నపేట, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుస్మిత చేసిన కామెంట్లకు వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కనీసం సభ్యత్వం లేని వారు మాట్లాడే మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. “గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కామెంట్ చేసిన వారికి సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. వారికి కనీసం కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదు. తెలుగులో ఓ సామెత ఉంది పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని. అమ్మాయి చిన్నా పెద్దా అని తేడా లేకుండా మాట్లాడుతుంది. ఆమెను వెనుక ఎవరున్నారో తెలుసు. డైపర్లు ఎవరు వేసుకుంటున్నారో తెలుసు. ఆమెకు ఎలాంటి అర్హత లేదు. ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారిని అలా అనటం సరైంది కాదు. రేవంత్ రెడ్డి కాలి గోటికి ఆమె సమానం కాదు.’ అని కేఆర్ నాగరాజు కౌంటర్ కామెంట్స్ చేశారు.
స్పందించిన రేవూరి ప్రకాష్ రెడ్డి
తనపై కొండా సుస్మిత చేసిన కామెంట్లపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పందించారు. కొండా సుస్మిత విమర్శలకు సమయం వచ్చినప్పుడు సరైన జవాబు ఇస్తానని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ముందు ముందు చాలా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తారని అందులో భాగంగానే ఆయన అలా అన్నారన్నారు. వ్యక్తిగత విమర్శలకు స్పందించి తన స్థాయిని తగ్గించుకోనని, ప్రజల్లో ఉన్న మంచి పేరు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగానే సీఎం రేవంత్ తనను పరకాల అభ్యర్థిగా ప్రకటించారని రేవూరి తెలిపారు. సుస్మిత చేసిన కామెంట్స్‌ను పూర్తిగా ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాన్నారు. మంత్రి కొండా సురేఖతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. రాజకీయాల్లో ఎవరి స్థాయి వారికి ఉంటుందని.. తాను 1993 నుంచి రాజకీయాల్లో ఉన్నానని తన స్థాయి తనకు ఉందని చెప్పారు. ముందే కోయిలు కూసిందన్నట్లు సుస్మిత మాట్లాడుతున్నారని ఆమె విమర్శలకు సరైన సమయంలో ధీటైన సమాధానం ఇస్తానని రేవూరి కౌంటర్ ఇచ్చారు.








