- బీసీలకు అండగా నిలిచింది టీడీపీ ప్రభుత్వమే
- కూటమి నిర్ణయంతో బీసీలకు రాజకీయ న్యాయం
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, సవితకు వనపర్తి బద్రి కృతజ్ఞతలు
మహా ప్రతినిధి ప్రత్తిపాడు ఆగస్టు 19 :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు (బద్రి) అన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
బీసీలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని బద్రి పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లకు పునాది వేసిన ఘనత దివంగత ఎన్టీఆర్కు దక్కుతుందని, 73, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తితో 1995లో యాక్ట్-5 ద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని అన్నారు.
1995, 2001, 2006, 2013 సంవత్సరాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవో 176తో పాటు జీవోలు 559, 560 ద్వారా బీసీ రిజర్వేషన్లు తగ్గించడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బద్రి విమర్శించారు. 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లు 24.15 శాతానికి తగ్గడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16,800 మంది బీసీ నాయకులు రాజకీయ అవకాశాలను కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభిస్తేనే గ్రామస్థాయి నుంచి నాయకత్వం ఎదిగి, భవిష్యత్తులో బీసీలు రాజకీయంగా మరింత బలోపేతం అవుతారని బద్రి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు, రాజకీయ హత్యలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, పెరిక సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రయ్య హత్య ఘటనను ఆయన ప్రస్తావించారు.
కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకున్న 34 శాతం, 33.33 శాతం రిజర్వేషన్ల నిర్ణయం బీసీల రాజకీయ భవిష్యత్తుకు మరింత భరోసా కల్పించిందని బద్రి అన్నారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కట్టుబడి పనిచేస్తున్నారని కొనియాడారు.
“బీసీలు అంటే తెలుగుదేశం.. బీసీలకు అండగా నిలిచే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం” అనే విషయం తాజా నిర్ణయంతో మరోసారి రుజువైందని బద్రి అన్నారు. బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు బీసీ వర్గాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు ధనేకుల సూర్య భాస్కరం వీరభద్రం, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి మదినే దొరబాబు, లింగంపర్తి సొసైటీ డైరెక్టర్ దనేకుల అదృష్టదీపుడు, మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం, బీసీ నాయకులు దిడ్డి రమణ, అత్తి వీర్రాజు, వనపర్తి జోగేంద్ర తదితరులు పాల్గొన్నారు.







