Mahaa Daily Exclusive

  అమరావతికి రైల్వే లైన్..!

Share

అమరావతి రైల్వే లైన్ వెళ్లే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యేలతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవాలని మంత్రిని రైతులు ఈ సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది.

 

రాజధానిని ఆనుకుని ఉన్న గ్రామాలు కావడంతో తమకూ పూలింగ్ అవకాశం ఇవ్వాలని రైతులు కోరారు. అయితే, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వారికి తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

 

అమరావతి మీదుగా వెళ్లే కొత్త రైల్వే లైన్ పరిధిలో పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల పరిధిలోని కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, నిడుముక్కల గ్రామాలు ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల రైతులు, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రావణ్ కుమార్‌తో మంత్రి సమావేశమయ్యారు.

 

మరో వైపు విజయవాడలో మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు, టౌన్ ప్లానింగ్ అంశాలపై మంత్రి చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.