Mahaa Daily Exclusive

  ఏపీలో మునిసిపల్ ఎన్నికల నగారా..! గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..!

Share

ఏపీ బ్యూరో, మహా : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు, కార్యాచరణను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను సైతం ఖరారు చేయడంతో ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో పాలక వర్గాల గడువు ముగియగా, నవంబర్ నాటికి మరో 13 పాలకవర్గాల పదవీకాలం పూర్తి కానుంది. దీంతో మొత్తం 100 పురపాలికలకు త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించడంతో తదుపరి ఎన్నికల షెడ్యూల్, ఏర్పాట్ల ప్రక్రియ అంతా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లనుంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సంకేతాలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కూటమి పక్షాలు ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతుండగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ప్రకటన, ఓటర్ల జాబితాల సవరణ వంటి కసరత్తులు వేగవంతం అవుతుండటంతో క్షేత్రస్థాయిలో పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి.

Latest