Mahaa Daily Exclusive

  అమిత్‌ షాకు ఘన స్వాగతం..! దక్షిణాది రాష్ట్రాల సమన్వయానికి జోనల్‌ కౌన్సిల్‌ కీలకం.

Share

• దక్షిణాది రాష్ట్రాల సమన్వయానికి జోనల్‌ కౌన్సిల్‌ కీలకం.

చెన్నై, మహా.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చెన్నై చేరుకున్న సందర్భంగా భాజపా జాతీయ సహ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భాజపా నేతలు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన కేంద్ర హోంమంత్రికి స్వాగతం తెలిపారు.

ఈ నెల 20న చెంగల్పట్టు జిల్లా కోవళంలోని తాజ్‌ ఫిషర్‌మ్యాన్స్‌ కోవ్‌లో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌ 31వ సమావేశంలో పాల్గొనేందుకు అమిత్‌ షా తమిళనాడుకు వచ్చారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

అమిత్‌ షాకు స్వాగతం పలికిన వారిలో తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌, రాష్ట్ర ఇన్‌చార్జి అరవింద్‌ మీనన్‌, భాజపా మత్స్యకార ప్రతినిధుల బృందం, న్యూ జస్టిస్‌ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ ఏ.సి. షణ్ముగం, ఎమ్మెల్యే భోజరాజన్‌, అన్నాడీఎంకే ప్రతినిధుల బృందం, ఇతర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదే సందర్భంగా ఐఎస్‌ఐ మద్దతుతో పనిచేస్తున్న షహజాద్‌ భట్టి ఉగ్రవాద నెట్‌వర్క్‌పై భద్రతా, నిఘా సంస్థలు ఇటీవల చేపట్టిన సమన్వయ చర్యలను సుధాకర్‌రెడ్డి అభినందించారు. 14 రాష్ట్రాల్లో 200 మందికి పైగా ఆపరేటివ్‌లను అరెస్టు చేసిన ఈ చర్య ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్‌ విధానానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నాయకత్వంలో దేశ భద్రత విషయంలో ఎలాంటి కుట్రలనైనా కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. భద్రత, నిఘా సంస్థల అప్రమత్తతను అభినందిస్తూ వారికి సుధాకర్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Latest