Mahaa Daily Exclusive

  పవనే వెపన్..!

Share

  • జాతీయ రాజకీయాల్లోకి రమ్మంటున్న బిజెపి కేంద్రనాయకత్వం..
  • పవన్ ముందు కీలక ప్రతిపాదన.. కేంద్రమంత్రిగా పవన్ కల్యాణ్.. పిఠాపురం ఎమ్మెల్యేగా నాగబాబు?
  • నాలుగురోజుల పవన్ ఢిల్లీ టూర్ వెనుక అంతర్గత ఎజెండా
  • వచ్చే ఏడాది ఢిల్లీ, బిహార్ తర్వాత ఏడాది తమిళనాడు, బెంగాల్, కేరళ ఎన్నికలు
  • పవన్ నేషనల్ పాలిటిక్స్ కు బాగా సూటవుతాడంటున్న బిజెపి హైకమాండ్
  • ఎపి, మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ సామర్థ్యాన్ని గుర్తించిన కేంద్రం
  • సనాతన స్లోగన్ తో ఆర్ఎస్ఎస్ ఫిదా
  • తెలుగు రాష్ట్రాల్లో.. తిరుగులేని పవనాలు
  • అమిత్ షా ఓపెన్ ఆఫర్.. మోడీ లవ్
  • పవన్ దేశరాజకీయాల్లో కాషాయ తురుపుముక్క
  • కంది.రామచంద్రారెడ్డి

 

(మహా, హైదరాబాద్)

 

జనసేనాని పవన్ కల్యాణ్ ఎపి రాజకీయాల్లో కింగ్ మేకర్ కాగా, భారతీయ జనతాపార్టీ ఆయనను మరో కోణంలో చూస్తోంది. పవన్ ఒక్క ఆంధ్రాకు, తెలుగురాష్ట్రాలకు కాదు భారతదేశ రాజకీయాల్లోనే ఒక సమ్మోహనశక్తిగా, సనాతన ధర్మ పరిరక్షణ సారధిగా, కాషాయ తురుపుముక్కగా చూస్తోంది. అందుకే ఎపికి డిప్యూటీసీఎంగా ఉన్నా.. కేంద్ర రాజకీయాల్లోకి రా..రమ్మంటోంది. ఎపిలోనూ, మహారాష్ట్రలోనూ పవన్ పద్దతిగా పనిచేసి ప్రత్యర్ధులను కొట్టిన తీరు బిజెపి పెద్దలను ఆశ్చర్యపరిచింది. అందుకే మీరు ఎపికి పరిమితం కావొద్దు. నేషనల్ పాలిటిక్స్ లోకి రమ్మని ఆహ్వానిస్తోంది. పవన్ తోడుంటే.. దేశవ్యాప్తంగా ప్రచారంలో గానీ, అనుకున్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో గానీ తిరుగుండదని బిజెపి అగ్రనాయకత్వం భావిస్తోంది. తాజాగా నాలుగురోజుల పాటు ఢిల్లీలో ఉండడం వెనుక పవన్ వ్యూహం కంటే బిజెపి అగ్రనాయకత్వ వ్యూహమే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదలైన రాజ్యసభ స్థానాల్లో ఒక దానికి నాగబాబును ఎంపిక చేయాలని జనసేన అధినేత పవన్ భావించగా, బిజెపి కేంద్ర నాయకత్వం మాత్రం పవన్ మీరు కేంద్రంలోకి రావొచ్చు కదా.. అంటూ ఆహ్వానించింది. అదే ఫలిస్తే.. పవన్ కేంద్రమంత్రిగా, నాగబాబు పిఠాపురం ఎమ్మెల్యేగా మారిన ఆశ్చర్యంలేదని ఢిల్లీవర్గాలు అంటున్నాయి.

 

నాలుగు రోజుల ఢిల్లీ టూర్ వెనుక ప్రత్యేక ఎజెండా

 

డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పవన్ కల్యాణ్ ఎప్పుడూ గడపలేదు. ఈ సారి మాత్రం..నాలుగు రోజుల పాటు డిల్లీలో ఉండి కేంద్ర మంత్రులతో పాటు ప్రధానితోనూ మాట్లాడారు. బీజేపీ పెద్దలతోనూ చర్చలు జరిపారు. ఎంపీలకు విందు ఇచ్చారు. జాతీయ మీడియాకూ ఇంటర్యూలు ఇచ్చారు. ఈ టూర్ వెనుక ఖచ్చితంగా ఏదో అంతర్గత ఎజెండా ఉందన్న అభిప్రాయం సహజంగానే రాజకీయవర్గాలకు వస్తుంది. ఎన్డీఏ కూటమి తరపున దక్షిణాది హిందూత్వ ఫేస్‌గా పవన్ కల్యాణ్‌ను ఫోకస్ చేయాలన్న ప్లాన్ లో బీజేపీ ఉందని ఈ దిశగా ఆయనను ఒప్పించేందుకు కసరత్తులు చేస్తోందని అంటున్నారు.

 

హిందూత్వ నినాదంతో హాట్ టాపిక్‌

 

తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం తర్వాత పవన్ కల్యాణ్ అనూహ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ బాట ఎంచుకున్నారు. వారాహి సనాతన ధర్మ పరిరక్షణ డిక్లరేషన్ ప్రకటించారు. ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించి తమిళనాడులోనూ హైలెట్ అయ్యారు. మహారాష్ట్ర ప్రచారంలోనూ హిందూత్వ వాదాన్ని వినిపించారు. జాతీయ మీడియాలో పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. బీజేపీ లైన్‌లో గట్టిగా హిందూత్వ వాదం వినిపించే కూటమి పార్టీ నాయకుడిగా ఆయనకు వచ్చిన పేరు జాతీయ స్థాయిలో ఫోకస్ తెచ్చి పెట్టింది.

 

కేంద్రమంత్రిగా చేయాలని మోడీ ప్లాన్

 

గతంలోనే అమిత్ షా ఎంపీగా పోటీ చేయమని సూచించారు నేను అసెంబ్లీకే పోటీ చేద్దామనుకుంటున్నా అని..జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల ప్రక్రియ వచ్చినప్పుడు మీడియాతో చెప్పారు. నిజానికి బీజేపీ పెద్దలు సూచించినది పవన్ కల్యాణ్‌ను కేంద్రంలోకి రమ్మనే. ఎంపీగా అయితే మరింత ఫోకస్ ఉంటుందని అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ ముందు ఇంట గెలవాలనుకున్నారు. అందుకే ఎమ్మెల్యేగానే పోటీ చేశారు. అయితే ఇటీవలి కాలంలో ఆయనకు వస్తున్న జాతీయ స్థాయి ఫోకస్ కారణంగా.. ఇప్పుడు మరోసారి బీజేపీ నాయకత్వం ఆయనను జాతీయ రాజకీయల వైపు రావాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మోడీకి పవన్ అంటే ప్రత్యేక అభిమానం. అందుకే పవన్ శక్తిని జాతీయ స్థాయిలో ప్రభంజనం చేయాలన్నది మోడీ వ్యూహంగా చెబుతున్నారు. బిజెపికి కూడా అన్ని రాష్ట్రాల్లో దీని వల్ల ఉపయోగముంటుందని భావిస్తున్నారు.

 

మీ అవసరం ఉంది బాసూ..

 

పవన్ కల్యాణ్‌కు వచ్చిన ప్రత్యేకమైన ఇమేజ్ ఇప్పుడు బీజేపీకి. ఎన్డీఏ కూటమికి ఇతర రాష్ట్రాల్లో కూడా అవసరమని భావిస్తున్నారు. ఆయనతో ఢిల్లీలో ప్రచారం చేయించుకుంటారని అంటున్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఆయన హాట్ టాపిక్. అందుకే పవన్ కల్యాణ్ ఆరు నెలల్లో కేంద్రంలో భాగం అవుతారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై బీజేపీ పెద్దల ఆలోచనలు ఎలాఉన్నాయో.. పవన్ కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలన్న ఆలోచన ఉందో లేదో మాత్రం స్పష్టత లేదు. కానీ వచ్చే కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 2025లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల బిహార్ లో పుష్ప-2 వేడుకకు లభించిన ఆదరణ చూశారు. ఇక పవన్ అడుగుపెడితే.. అంతకు ఎన్నిరెట్లు ఉంటుందోనన్న చర్చ ఉంది. ఇక 2026లో తమిళనాడు లో పవన్ వెపన్ అత్యంత కీలకం. తెలుగురాష్ట్రాల హీరోలకు తమిళనాడులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక పవన్ కల్యాణ్ వేరే లెవెల్. 2026లో తమిళనాడుతో పాటు కేరళ, బెంగాల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగా పవన్ శక్తిని పెంచుకుంటూ వెళ్తే రాజకీయంగా బిజెపికి ప్రయోజనముంటుందని, జాతీయ స్థాయిలో పవన్ శక్తి రానున్న రోజుల్లో పార్టీకి రక్షణ కవచంలా ఉంటుందన్న అంచనాలు పార్టీ పెద్దల్లో ఉన్నట్లు తెలిసింది. అటు ఎపిలోనే కాదు.. ఇటు తెలంగాణలోనూ పవన్ హవాకు తిరుగులేదని, ఓవరాల్ గా బిజెపి అగ్రనాయకత్వం జాతీయస్థాయిలో పవన్ పార్టీకి, భారతరాజకీయాలకు ఓ పవర్ లా వెలుగొందుతాడన్న అంచనాలు కూటమిలోని పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. మరి మోడీ ప్లాన్ ఏంటి.. పవన్ ఆచరణేంటి? అన్నది ముందుముందు తెలుస్తుంది.

……