Mahaa Daily Exclusive

  లగచర్ల ఫార్మా రద్దు.. భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ..

Share

  • జనం మాటే..
  • రేవంత్ బాట
  • – నిన్న దిలావర్ పూర్.. నేడు లగచర్ల
  • – ఫార్మాస్థానంలో కాలుష్యరహిత పరిశ్రమలు

 

హైదరాబాద్, మహా

ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణనలోకి తీసుకుంటున్నారు. జనం మాటే.. తన బాట అని స్పష్టం చేస్తున్నారు. ప్రజల కోసం తగ్గేందుకైనా రెడీ అంటున్నారు. లగచర్ల రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీల ఏర్పాటు ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంది. మూడు గ్రామాల్లో 1358 ఎకరాల భూసేకరణ కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజీల కోసం లగచర్లలో 632 ఎకరాలు, హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం జూన్ 7న టీజీఐఐసీ 1358 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలు ఇచ్చింది. టీజీఐఐసీ ప్రతిపాదనల మేరకు పట్టా, అసైన్డు భూముల సేకరించేందుకు తాండూరు ఆర్డీవోను జూన్ 28న భూసేకరణ అధికారిగా వికారాబాద్ జిల్లా కలెక్టర్గా నియమించారు. పోలేపల్లిలో 71 ఎకరాలు, లగచర్లలో 632 ఎకరాల భూసేకరణకు జులై, ఆగస్టులో అనుమతిచ్చారు. అయితే ఫార్మా పరిశ్రమలపై లగచర్లలో రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం పునస్సమీక్షించింది. అక్కడ పెట్టేది ఫార్మావిలేజి కాదని పారిశ్రామిక జోన్ అని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం భూసేకరణ ఉపసంహరించుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్కు టీజీఐఐసీ తెలిపింది. ఫార్మా విలేజీల బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం తాజాగా భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నేపథ్యంలో గతంలో ఫార్మా సిటీ విలేజీల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లను వెనక్కి తీసుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్ పత్రికల్లో ప్రకటనలు జారీ చేశారు. తాజాగా ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ కోసం తాండూరు సబ్ కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు. త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రైతుల అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

……….