59 వేల గుడిసె కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు.
• గుడిసెలు లేని తెలంగాణగా మారుస్తాం.
• అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటన
హైదరాబాద్, మహా:
రాష్ట్రంలోని గుడిసెల్లో నివసిస్తున్న 59 వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పేదల జీవనాధారానికి దూరంగా ఇళ్లు నిర్మించి వారిని 30–40 కిలోమీటర్లు తరలించే విధానం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు వీలైనంత సమీపంలోనే ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన సుమారు 59 వేల గుడిసెల కుటుంబాలను ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో ప్రాధాన్యతా వర్గంగా పరిగణించనున్నట్లు వెల్లడించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ఇళ్ల కేటాయింపులు చేపడుతున్నామని తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి రెండో విడతలో 2,000 ఇళ్లను కేటాయించగా, అందులో 500 ఇళ్లను గతంలో నిర్మాణం ప్రారంభమై వివిధ కారణాలతో మధ్యలోనే నిలిచిపోయిన ఇళ్లకు కేటాయించే విధానం ఉందని ప్రభుత్వం వివరించింది. గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు కూడా రెండో విడతలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
పేదలను వారి ఉపాధి, జీవనాధారాలకు దూరంగా తరలించడం వల్ల కుటుంబాలపై అదనపు భారం పడుతుందని మంత్రి పేర్కొన్నారు. అందుకే ఇన్-సిటూ విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, సాధ్యమైన చోట్ల వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి 5–8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్లను నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో భూముల ధరలు ఎకరాకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉన్న ప్రాంతాల్లోనూ పేదల గౌరవాన్ని కాపాడేలా ఇళ్ల కేటాయింపులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సాయంపై కూడా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఉచిత ఆర్థిక సహాయం అందిస్తున్న రాష్ట్రం మరొకటి లేదని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మొత్తం సరిపోవడం లేదని సభ్యులు సూచించడంతో, సహాయాన్ని పెంచే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొత్తం 8 లక్షల ఇళ్లను రెండు దశల్లో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మొదటి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సుమారు రూ.22,500 కోట్లు, రెండో దశలో 2.5 లక్షల ఇళ్లకు సుమారు రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో మరో లక్ష ఇళ్ల నిర్మాణానికి సుమారు రూ.5,500 కోట్లు అవసరమవుతాయని మంత్రి వివరించారు. మొత్తంగా ఈ కార్యక్రమానికి రూ.39 వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయనుంది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రయోగాత్మకంగా ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. 20 నియోజకవర్గాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, 16 నియోజకవర్గాల్లో లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తయి భౌతిక ధ్రువీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఏడాది బోనాల నాటికి ఇందిరమ్మ టవర్లలో గృహప్రవేశాలు నిర్వహించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో సుమారు రూ.750 కోట్లను కూడా చెల్లించినట్లు వెల్లడించారు. నిర్మాణం పునాది, గోడలు లేదా పైకప్పు దశల్లో నిలిచిపోయిన వ్యక్తిగత ఇళ్లను కూడా రెండో విడతలో పూర్తి చేసేందుకు ప్రత్యేక విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు.








