*సుమంత్ జీవితమే సర్వ నాశన మైంది*
*కొండా సురేఖ మాజీ ఓఎస్‌డి సుమంత్ భార్య*
*20 రోజులుగా మా కుటుంబం పై తీవ్ర ఒత్తిడి*
*ఒత్తిడి తట్టుకోలేక మా మామయ్య ఆత్మహత్యాయత్నం*
*ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స.. పరిస్థితి విషమం*
వరంగల్, మహా ;
మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ పై వచ్చిన ఆరోపణల విషయంలో అనేక తప్పుడు ఆరోపణలు మీడియా, సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తుండటం బాధ కలిగిస్తోందని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. సుమంత్ విషయంలో వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయాలని మీడియాను కోరుతున్నాను. సుమంత్ వ్యవహారంలో ఒకవైపు కథనాలు వస్తున్న నేపథ్యంలో మా కుటుంబం చెప్పే మరో కోణాన్ని కూడా పరిశీలించి వార్తలను ప్రచురించాలని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. గత 20 రోజులుగా మా కుటుంబం పై తీవ్ర మానసిక ఒత్తిడి కొనసాగుతోందని ఆ ఒత్తిడిని తట్టుకోలేక మా మామయ్య సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దాదాపు 60 నిద్రమాత్రలు మింగారు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితి మా అందరికీ ఒక ఊహించని విషమ పరిస్థితిగా మారింది. ఇంత టార్చర్ ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. సుమంత్ విషయంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నాను.
*రాజకీయాలకు దూరంగా వ్యాపారం*
రాజకీయాలకు దూరంగా వ్యాపారం చేసు కుంటున్నామని
మాకు ఇవన్నీ ఎందుకని సుమంత్ కూడా తన జీవితాన్ని తిరిగి నిర్మించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కేసులు, విచారణలు, కుటుంబ సభ్యులపై ఒత్తిడి కారణంగా ప్రశాంతంగా ఉండ లేకపోతున్నాం. సుమంత్ ఐఐఎంలో చదువుకుని కార్పొరేట్ రంగంలో మంచి జీవితాన్ని ఎంచుకునే అవకాశం ఉన్న వ్యక్తి, కొండా సురేఖ ఆంటీ, మురళి అంకుల్ తో ఉన్న స్నేహం, అభిమానంతో ఓఎస్‌డీ గా పనిచేయడానికి వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఆయన ఉద్యోగ జీవితం దెబ్బతింది. ఇప్పుడు కేసుల కారణంగా కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతోంది. సుమంత్ జీవితమే ఇప్పుడు నాశనమై పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.








