Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌ దాటి టైర్‌-2 నగరాలకు ఐటీ జోరు…

Share

హైదరాబాద్‌ దాటి టైర్‌-2 నగరాలకు ఐటీ జోరు.
* దిగ్గజ సంస్థలకు తెలంగాణ ఆహ్వానం.
* నిజామాబాద్‌ ఐటీ హబ్‌పై ప్రత్యేక దృష్టి.
* కాగ్నిజెంట్‌, విప్రో, మైక్రోసాఫ్ట్‌ తదితర కంపెనీలకు ఆహ్వానం.
* స్థానిక యువతకు ఉద్యోగాలే లక్ష్యం.
* అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన.

హైదరాబాద్‌, మహా:

హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఐటీ, పరిశ్రమల అభివృద్ధిని రాష్ట్రంలోని టైర్‌-2 నగరాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. నిజామాబాద్‌ సహా ఇతర నగరాల్లో ప్రముఖ ఐటీ సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు, విధానాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్థానిక యువతకు వారి ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజు ఐటీ శాఖకు సంబంధించిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ, పరిశ్రమల రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.

నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని దేశ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పలు ప్రముఖ సంస్థలను ప్రభుత్వం ఆహ్వానించిందని మంత్రి తెలిపారు. కాగ్నిజెంట్‌, క్యాప్‌జెమినీ, విప్రో, మైక్రోసాఫ్ట్‌, టెక్‌ మహీంద్రా, యాక్సెంచర్‌, టీసీఎస్‌, ఒరాకిల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ వంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

‘‘స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. కంపెనీలు పెట్టుబడులు పెట్టే ముందు తమ భవిష్యత్‌ అవసరాలు, లాభదాయకత, విస్తరణ అవకాశాలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు వంటి మౌలిక సదుపాయాల పరిస్థితినీ పరిశీలిస్తున్నాయి. ఆయా సంస్థలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలు, విధానాలు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని శ్రీధర్‌బాబు తెలిపారు.

నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో పెద్ద కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి ప్రశ్నించారు. భూమి సేకరించి ఐటీ హబ్‌ నిర్మించినా దాని ద్వారా స్థానిక యువతకు పెద్దగా ప్రయోజనం కలగలేదని పేర్కొన్నారు. ప్రముఖ కంపెనీలు ఎందుకు రావడం లేదన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యోగాల కోసం యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.

అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన నియోజకవర్గంలోనూ ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఐటీ అవకాశాలను జిల్లాలు, నియోజకవర్గాల స్థాయికి విస్తరించడం ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాల ఫలితంగా రెండేళ్లలో 108 పెట్టుబడి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. గత తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో కుదిరిన 75 అవగాహన ఒప్పందాల్లో 23 శాతం, అంటే 17 ప్రాజెక్టులు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు.

దావోస్‌లో జరిగిన పెట్టుబడుల సదస్సుల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లోనూ 45 శాతం ప్రాజెక్టులు ఇప్పటికే కార్యరూపం దాల్చాయని మంత్రి వివరించారు. పెట్టుబడుల విషయంలో కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా అవి వాస్తవ రూపంలోకి వచ్చేలా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు.

టైర్‌-2 నగరాల్లో ఐటీ, పరిశ్రమలు విస్తరించాలంటే కేవలం భూమి, భవనాలు సరిపోవని ప్రభుత్వం భావిస్తోంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మెరుగైన రవాణా సదుపాయాలు, విద్య, వైద్యం, నివాస వసతులు, హోటళ్లు, ఇతర పట్టణ మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు. అందుకే కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసే ముందు ఆయా ప్రాంతాల్లోని మొత్తం మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నాయని తెలిపారు.