ములకలపల్లి మండల కేంద్రంలోని రింగిరెడ్డి పల్లి రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ గాయాలపాలయ్యారు. సంగు వెంకన్న ఇంటి వద్ద ఉన్న ఆరె చెట్టు పైన ఉన్న విద్యుత్ తీగలు కొమ్మలకు తగిలి షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. అటుగా వెళుతున్న నరాటి వెంకట లక్ష్మి (30)పై కరెంట్ తీగ పడటంతో ఆమె సృహతప్పి కిందపడ్డారు. స్థానికులు ఈ ప్రమాదాన్ని గమనించి సమయస్ఫూర్తితో విద్యుత్ తీగను తొలగించి, వెంటనే సిపిఆర్ నిర్వహించారు. ఆమె సృహలోకి రావడంతో, మంగపేట పీహెచ్‌సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించడమే కాక, వైద్యుని సూచనతో పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలు బలహీనంగా ఉండి చెట్ల కొమ్మలు వాటికి తగులుతున్నాయి అని చాలాసార్లు అధికారులకు తెలిపాము. కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని బాధితురాలి భర్త నరాటి వెంకన్న తెలిపారు. ప్రస్తుతం, స్థానికులు ఈ ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.