Mahaa Daily Exclusive

  కార్చిచ్చు.. కేటీఆర్ వర్సెస్ కవిత..

Share

  • కవిత యాక్టివ్..
  • కేటీఆర్ ఇన్ యాక్టివ్
  • కవిత కారణంగానే పార్టీకి చిక్కులువచ్చాయని భావిస్తున్న కేటీఆర్
  • ఏడాదికాలంగా పార్టీకి జవసత్వాలు తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డిన కేటీఆర్
  • ఇపుడు కవిత రీఎంట్రీపై అభ్యంతరాలు
  • ఇప్పుడు యాక్టివ్ కావాల్సిన అవసరమేమొచ్చిందంటున్న కేటీఆర్ ఆంతరంగికులు
  • ఏపీ తరహాలో.. అన్నా చెల్లెల్ల మధ్య వైరుధ్యాలు

 

(మహా, ప్రత్యేక ప్రతినిధి): కార్చిచ్చు రగిలింది. ఇంతకాలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, తెలంగాణ ప్రభుత్వం మీద ఒంటికాలిపై లేచి.. ప్రభుత్వంపై వ్యతిరేకత రగిల్చేందుకు సర్వశక్తులు ఒడ్డిన కేటీఆర్ ఇపుడు ఒక్కసారిగా బ్రేక్ తీసుకుంటున్నా అని ప్రకటించడం సంచలనంగా మారింది. ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు, ఆందోళనలు.. రూపం ఏదైనా తన పొలిటికల్ కెరీర్ లో ఎన్నడూ పడనంత కష్టం, రాజకీయ వ్యూహాలు అమలుచేసి తాను పరుగెడుతూ సర్కారును పరుగెత్తించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇపుడు రాజకీయాలకు విరామం ప్రకటించడం ఆశ్చర్యం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ప్రకటన వెనుక కార్చిచ్చు.. కుటుంబ వ్యవహారాలే అని వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవిత లిక్కర్ స్కామ్ పై పెద్ద ఎత్తున చర్చ జరగ్గా, బీఆర్ఎస్ ఓటమి కారణాల్లో ఈ స్కాంపై జరిగిన దుష్ప్రచారం కూడా ఒకటని నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత అరెస్ట్ కావడం, కవిత సుదీర్ఘకాలం జైలులో ఉన్నా ఆమెను బయటకు తెచ్చేందుకు కేటీఆర్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఘటనలు..సంఘటనలు ఏం ఉన్నా జైలు నుండి బయటకు వచ్చిన కవిత మళ్ళీ వేగంగా యాక్టివ్ కావడంపై కేటీఆర్ ఆంతరంగికులు విస్తుపోతున్నారు. ఇప్పటికే ఓ వైపు కేటీఆర్, మరోవైపు హరీష్ మధ్య పోటీ ఉంది. ఇపుడు కవిత యాక్టివ్ కావడంతో కేటీఆర్ ఇంతకాలం పడ్డ శ్రమ, భవిష్యత్తుపై ఒక్కసారిగా ముఖ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా.. సెంటిమెంట్ ప్రకారం కేటీఆర్ కన్నా జైలుకెళ్ళొచ్చిన కవిత ముఖ్యమంత్రి సీరియల్ లో ముందువరుసలో ఉంటారని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు కూడా ఇప్పటికిపుడు లేవు. పార్టీ క్యాడర్, లీడర్లు అంతా యాక్టివ్ గా ఉన్నారు. అధినేత కేసీఆర్ ప్రజాక్షత్రంలోకి రాకున్నా, కవిత జైలులో ఉన్నా.. కేటీఆర్ అన్నీ ఎదుర్కొని ప్రతిపక్షపాత్రను సమర్ధంగా పోషించారు. కవిత రీఎంట్రీ తర్వాత కేటీఆర్ బ్రేక్ ప్రకటించడం వెనుక ప్రధానంగా కుటుంబ అంతర్గత అంశాలే కారణంగా కనిపిస్తోందని ఆంతరంగికులు అంటున్నారు.

 

కేటీఆర్ పోస్ట్ తో అలజడి…

 

కేటీఆర్ తాజా పోస్ట్ గులాబీ పార్టీలోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో అలజడికి కారణం అయ్యింది. కొత్త అంశం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో ఇంటిపోరు సాగుతోంది.. ఈ క్రమంలోనే కేటీఆర్ ఇలా విరామం తీసుకుంటున్నారని రాజకీయనాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను చేపట్టేందుకు కేటీఆర్, హరీశ్ రావు, కవిత.. ఈ ముగ్గురూ పోటీ పడుతున్నారని, ఇందుకు సంబంధించి ఎవరికి వారు పావులు కదుపుతున్నారని, ఇదంతా కూడా కేసీఆర్ కు ప్రస్తుతం పెద్ద తలనొప్పిగా మారిందని, అయితే, ఒక రకంగా కవిత తన పంతాన్ని నెగ్గించుకోబోతున్నారని, ఇందుకు సంబంధించి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో కూడా చర్చలు జరిగాయని, దీంతో కేటీఆర్, హరీశ్ రావులు అలిగారని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. అందుకే కేటీఆర్ విరామం తీసుకుంటున్నారేమోనని అనుకుంటున్నారు. ఇటు హరీశ్ రావు కూడా అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఏపీలో షర్మిల, జగన్ మధ్య నడుస్తున్న పోరు మాదిరిగానే ఈ ఎపిసోడ్ ఉండబోతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్, షర్మిల మధ్య విబేధాలు వచ్చినప్పుడు కూడా ఇదే మాదిరిగా నెమ్మదిగా అసమ్మతి రాగం బయటకొచ్చిందని, ఆ తరువాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి వచ్చి.. చివరకు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రస్తుతం కొనసాగుతుందని… ఇదే మాదిరిగా కల్వకుంట్ల కుటుంబంలో ఇంటిపోరు కొనసాగుతుందని, రానున్న రోజుల్లో ఈ పోరు బయటపడుతుందని అనుకుంటున్నారు.

Latest