హైదరాబాద్, మహా : రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఇళ్ళు కూల్చడం, భూములు లాక్కోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆచరణలో అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీ ల పేరుట 66 హామీలు ఇచ్చి కేవలం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఎక్కడ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదన్నారు. రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, ఆటో డ్రైవర్లు, కౌలు రైతులు అన్ని వర్గాల ప్రజలు.. ఈ ప్రభుత్వ నైజం తెలియడానికి 9 నెలల సమయమే పట్టిందని భావిస్తున్నారు. అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఏడాదిలో ప్రజలకు ఏం ఛేశారని సంబరాలు చేసుకుంటున్నారో పాలకులు ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంబరాలకు వాస్తవం ఏంటో తెలియజెప్పే బాధ్యతలో భాగంగా బీజేపీ నియోజకవర్గాల వారీగా ప్రజలతో ముచ్చటించడం, సమస్యలు తెలుసుకోవడం, బైక్ ర్యాలీ నిర్వహించడం, ప్రజలతో సభలు ఏర్పాటు చేసి చైతన్య పరచడం, వాళ్లకు విశ్వాసం కలిగించడంలో భాగంగానే సరూర్ నగర్ స్టేడియంలో ఏడవ తేదీన సభ నిర్వహిస్తున్నామన్నారు.
పెన్షన్లు కోల్పోయిన వారు, పెన్షన్ పెరుగుతాయని ఆశపడ్డారని, భంగపడ్డ ఆటో డ్రైవర్లు అనేక వర్గాల ప్రజలు ఆ సభలో పాల్గొని ఈ ప్రభుత్వానికి నిరసన చెప్పే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది కాబట్టి ఆ సభను విజయవంతం చేయాలని కోరారు.
ప్రభుత్వం అంటే ప్రజలను ఆదుకోవాలి కానీ ఇబ్బందులకు గురి చేయోద్దన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండే కార్యక్రమాలు చేస్తున్నాడని, ఒకటి ఇల్లు కూలగొట్టడం రెండు భూములు గుంజుకోవటమని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వ అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చి వేస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ స్కెచ్ వేశాడన్నారు. లగచర్లలో రైతులు ప్రాణాలైనా ఇస్తాం తప్ప పంట పొలాలు ఫార్మసిటీ కోసం ఇవ్వమని చెప్పారని, దీంతో మాట మార్చిన రేవంత్ రెడ్డి ఫార్మసిటి కాదు ఇండస్ట్రియల్ పార్క్ పెడతామని మాట మార్చారన్నారు. ఏది పెట్టినా కూడా రైతుల ఇష్టానుసారంగా, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 2000 ఫీట్లతో నాగార్జునసాగర్, శ్రీశైలం రోడ్లు ఉన్నాయి. ఈ రెండు రోడ్లను అనుసంధానం చేసుకుంటూ ఒక లింక్ రోడ్డు కూడా ఉంది. అదనంగా అక్కడ ఇంకో రోడ్ అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి అహంకారంతో మళ్ళీ 330 ఫీట్లతో మరొక రోడ్డుకు శ్రీకారం చుట్టాడన్నారు. అధికారం ఉందని పోలీసులతో రైతులను బెదిరించే ప్రయత్నం చేసిన, భూములు బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేసిన ఖబర్దార్ అని ఈటల రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూసి, హైడ్రా, లగిచర్ల ఘటనలపై ఎదురు దెబ్బలు తగిలినా సిగ్గులేకుండా చక్రవర్తి లాగా, నియంతలాగా, శాడిస్ట్ లాగా ఇలాంటివి చేస్తే మంచిది కాదని ఈటల అన్నారు.







