Mahaa Daily Exclusive

  ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే..!

Share

  1. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే

ప్రభుత్వంపై జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టండి

ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి.

ప్రజాపాలనలో విద్య, వైద్యరంగాలకు పెద్దపీఠ వేశాం

దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా నియామకాలు చేపట్టాం

వైద్య శాఖ బలోపేతమైతేనే ఆరోగ్య తెలంగాణ

ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

213 నూతన అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం

మాకు కుర్చీ రావడానికి కారణం ఈ ప్రజలు, కార్యకర్తలే. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీదే. ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే బాధ్యత కూడా మీదే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రజాపాలనకు ఏడాది పూర్తయిందని.. తమ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. ఆరోగ్య ఉత్సవాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 213 నూతన అంబులెన్సులను ప్రారంభించారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 108 కోసం 136, 102 కోసం77 అంబులెన్స్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. వేలాదిగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేశామని గుర్తుచేశారు. వైద్యాఆరోగ్య శాఖలో 7,750 మందిని నియమించామని చెప్పారు. మరో 6,496 ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వైద్యారోగ్యశాఖ బలోపేతమైతేనే ఆరోగ్య తెలంగాణ సాధ్యమన్నారు. 16 నర్సింగ్‌ కాలేజ్‌లను ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. 28 పారా మెడికల్ కాలేజ్‌లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 8 మెడికల్‌ కాలేజ్‌లకు జీఓలు ఇచ్చినా.. కనీస మౌలిక సదుపాయాల కల్పనలో చిత్తశుద్ధి చూపించలేదని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

 

తలరాతలు మార్చింది మీరే

 

ఈ ప్రభుత్వం కష్టం మీద వచ్చిందని చెప్పడం లేదని, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించడం ద్వారా మా తలరాతను మార్చి పెద్ద బాధ్యతలు ఇచ్చారని, కాబట్టి విషప్రచారాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీదే అని సీఎం అన్నారు. నల్లచట్టాలు తెచ్చిన మోడీ, వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఏడాదిలోపు తమ ప్రభుత్వం వైద్యశాఖలో 14 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. వైద్య శాఖ బలోపేతమైతేనే ఆరోగ్య తెలంగాణ నిర్మాణమవుతుందన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున వైద్య శాఖలో ఎవరూ భర్తీ చేయలేదన్నారు. దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.

 

తెలంగాణ సమాజమే మా కుటుంబం

 

తెలంగాణ సమాజమే తమ కుటుంబం అనుకొని తాము ఉద్యోగాలు ఇచ్చామని సీఎం అన్నారు. బీఆర్ఎస్ ఎనిమిది మెడికల్ కాలేజీలను ఇచ్చి కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. పరీక్షలు వాయిదా వేయమని చాలామంది డిమాండ్ చేశారని, కానీ విద్యార్థుల విలువైన సమయం వృథా అవుతుందని అలా చేయలేదన్నారు. కానీ గత ప్రభుత్వం పలుమార్లు వాయిదా వేసిందన్నారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నదని… తాము మాత్రం పంటలు వేసేలా ప్రోత్సహించామన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ ప్రకటించామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడుతుంటే కొంతమందికి భయం పట్టుకుందన్నారు.

 

సంక్రాంతికి గంగిరెద్దుల్లా..

 

సంక్రాంతికి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు కొంతమంది వస్తారని, కానీ వారు వచ్చేది పంచాయతీ ఎన్నికల కోసమే. ‘తెలంగాణ రైతులు 63 లక్షల ఎకరాల్లో కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు ఇస్తున్న బోనస్‌తో కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. వచ్చే పదేళ్లు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.. బోనస్ కొనసాగిస్తుంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, 15 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే. ప్రభుత్వం పైన జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి…పదేళ్ల పాటు అధికారంలో ఉండి జయ జయహే పాటను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం కాదా… తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్‌లో పెట్టే ఆలోచన కూడా గత పాలకులకు రాలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గత పాలకులు నెరవేర్చలేదు.. తెలంగాణ ప్రభుత్వ ఏడాది విజయోత్సవాలకు ప్రజలు తరలిరావాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.