Mahaa Daily Exclusive

  ముంబైలో ఉద్రిక్తత.. 400 మందికి పైగా అరెస్టు.

Share

• నిరసనల్లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్.

ముంబై, మహా:

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసనలకు మద్దతుగా ముంబైలో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ముందస్తు అనుమతి లేకుండా నగరంలోని ఆగస్ట్ క్రాంతి మైదానం, ఇతర ప్రాంతాల్లో నిరసనలు చేపట్టడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో 400 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న నిరసనలకు సంఘీభావంగా ముంబైలో ఈ ఆందోళనలు చేపట్టారు.

పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు

సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ నేతృత్వంలోని ‘హమ్ భారత్ కే లోగ్’ సంస్థ సభ్యులు, సీపీఐ(ఎం) కార్యకర్తలు శుక్రవారం ఉదయం నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు, ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ కార్యకర్తలు కూడా సీజేపీ ఆందోళనలకు మద్దతుగా దక్షిణ ముంబైలోని హుతాత్మా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

అనుమతి లేకుండా నిరసనలపై కేసులు

ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టిన వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు, ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి మద్దతు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముంబైలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదుపులోకి తీసుకున్న వారిపై తదుపరి చర్యలకు సంబంధించి పోలీసుల నుంచి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.