Mahaa Daily Exclusive

  ఫ్లైదుబాయ్ విమానంపై ఉగ్రకుట్ర.. ఎన్ఐఏ కేసు నమోదు.

Share

  •  ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ఎఫ్ఐఆర్‌.

న్యూఢిల్లీ, మహా:

ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఉగ్రకుట్ర ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. యాంటీ హైజాకింగ్ చట్టం–2016, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.సెప్టెంబరు 30న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది .ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏను ఆదేశించడంతో దర్యాప్తు ప్రారంభమైంది.

పైలట్‌పై గొడ్డలితో దాడి

విమానం ప్రయాణిస్తున్న సమయంలో కో-పైలట్ అల్‌హమ్మామీ, ప్రధాన పైలట్ స్మిత్ మచ్చార్‌పై గొడ్డలితో దాడి చేసినట్లు కథనాలు వెల్లడించాయి. ఈ ఆకస్మిక దాడితో విమానంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయినప్పటికీ ప్రధాన పైలట్ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ విమానాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు. ప్రయాణికుల్లో ఉన్న విధుల్లో లేని ఇద్దరు పైలట్ల సహకారంతో విమానాన్ని సౌదీ అరేబియాలో సురక్షితంగా దించినట్లు సమాచారం. అనంతరం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కో-పైలట్‌ను సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఉగ్రకుట్ర కోణంలో దర్యాప్తు

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం విచారణ బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించింది. యాంటీ హైజాకింగ్ చట్టం, ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థ.. ఘటనకు దారితీసిన పరిస్థితులు, దాడి వెనుక ఉద్దేశం, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై దర్యాప్తు చేపట్టనుంది. అయితే ప్రస్తుతం నమోదైన ఎఫ్ఐఆర్‌లో కుట్రకు గల కారణాలను వెల్లడించలేదని, అదుపులో ఉన్న కో-పైలట్ మినహా మరెవరిపేరునూ ప్రస్తావించలేదని సమాచారం. దర్యాప్తు పురోగతిలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రధాన పైలట్ ఆరోగ్యంపై ఆరా

దాడిలో గాయపడిన ప్రధాన పైలట్ స్మిత్ మచ్చార్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపినట్లు సమాచారం. విమానాన్ని సురక్షితంగా దించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా నిలిచాయి. అంతర్జాతీయ మార్గంలో ప్రయాణిస్తున్న విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై వివిధ భద్రతా సంస్థలు దృష్టి సారించాయి. ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.