‘మీ వాడ్ని,మీలో ఒకడ్ని… ‘
ప్రజల గుండెను
టచ్ చేసిన రేవంత్ !
”మీ వాడ్ని,మీలో ఒకడ్ని,సాధారణ రైతుబిడ్డను’… అంటూ ‘రైతు పండుగ’ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుపెట్టి,చేసిన ప్రసంగం తెలంగాణ రైతులు,సాధారణ ప్రజలందరినీ ఆకట్టుకున్నది.ఈ విధమైన ప్రసంగ శైలి అరుదు.’ప్రసంగ కళ’ లో నైపుణ్యం ఉండాలి.’కమ్యూనికేషన్ స్కిల్స్’ లో ఇది కీలకం. బహిరంగసభల్లో లక్ష మంది హాజరయినా,అందులో ప్రతి ఒక్కరూ తమతోనే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టుగా భావిస్తారు.
నేరుగా ‘కనెక్టు’ కావడానికి ‘మీ మనిషిని,నేను ఇక్కడ పుట్టినోన్ని,ఇక్కడి మట్టిలో కలిసే వాణ్ణి.ఈ ప్రాంతంపై నాకంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుంది’ అని వినమ్రంగా చెప్పడం ఉపయోగపడుతుంది. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మినహా,మరెవరూ తెలంగాణలో వాగ్ధాటిగా మాట్లాడలేరనో,ఆయనలా పంచ్ విసరలేరనో,ఆయన వలె జనాన్ని ఉత్తేజ పరచలేరనో,ఉర్రూతలూగించలేరనో ఒక ప్రచారం ఉన్నది.కేసీఆర్ కు మించిన ‘ఫైర్ ‘తో రేవంత్ రెడ్డి ప్రసంగాలు సాగుతున్నవి.శషభిషలు లేకుండా కేసీఆర్ సహా ఎవరినయినా ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తుండడమంటే చాలా తెగింపు కావాలి.అది రేవంత్ లో టన్నుల కొద్దీ ఉన్నది.కేసీఆర్ కు ‘మాటల మాంత్రికుడు’ అనే పేరుంది.దాన్ని సులువుగా రేవంత్ రెడ్డి ‘ఓవర్ టేక్’ చేస్తున్నట్టుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.కేసీఆర్ వాక్చాతుర్యాన్ని రేవంత్ ఒడుపుగా పట్టుకున్నారు.రేవంత్ రెడ్డికి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉండడానికి కారణమిదే!
‘ఏడాది కాలంలో రేవంత్ బాస్ అయ్యారా,మాస్ అయ్యారా?’ అని ఒక వెబ్ సైటు అసక్తికరమైన కథనాన్ని ఆదివారం ప్రచురించింది.ఆ కథనంలోని ‘కంటెంటు’ గురించి మాట్లాడదలచుకోలేదు. కానీ నా ఉద్దేశంలో రేవంత్ ఏడాది పాలనలోనే ‘బాస్’ గానూ, ‘మాస్’ గానూ గుర్తింపును,ఒక ప్రత్యేకతను సంపాదించుకోగలిగారు.ముఖ్యమంత్రిగా ఆయనకు పాలనపై పట్టు రాలేదని కొన్ని నెలల కిందటి వరకు ప్రచారం సాగింది.అయితే రేవంత్ రెడ్డి పాలనాపరమైన అనుభవం గడించడానికి,పట్టు బిగించడానికి పెద్దగా సమయం పట్టలేదు.
‘అన్నింటికీ అనుభవం అవసరం లేదు.కొన్నింటికి కసి,పట్టుదల ఉంటే చాలు.రామాయణం రాసిన వాల్మీకి ఒక దొంగ. కామసూత్ర రాసిన వాత్సాయనుడు ఒక బ్రహ్మచారి.’ అనే విషయం చాలామందికి తెలియదు. తాను మంత్రిగా పనిచేయకపోయినా,ప్రజల అభిమానం,పార్టీ హైకమాండ్ ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవి లభించినట్టు రేవంత్ నవంబర్ 30 న మహబూబ్ నగర్ సభలో ఎంతో వినయంగా చెప్పుకున్నారు.పార్టీ సీనియర్ల సహకారంతో ‘ప్రజా ప్రభుత్వం’ సమర్ధంగా పనిచేస్తున్నట్టు కూడా చెప్పారు.
”మీ కుట్రలు, కుతంత్రాలకు నేను బెదిరేవాణ్ణి కాదు.నల్లమలలో తోడేళ్ళు,పులులు ఎన్నో చూశా.మానవ మృగాలు మీరెంత”? అని బిఆర్ఎస్ నాయకత్వాన్ని సీఎం అటాక్ చేశారు.బిఆర్ఎస్ నాయకులను ‘మానవ మృగాలు’ గా నిర్వచించినప్పుడు ‘రైతుపండగ’ సభలో జనం నుంచి ఈలలు,చప్పట్లు మార్మోగాయి.
ముఖ్యమంత్రి చెప్పినా చెప్పకపోయినా,రైతుల ఖాతాల్లో వారి పంటకు బోనస్ డబ్బులు జమ అవుతుంటే,బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్న వాతావరణం కనిపిస్తున్నది. కాళేశ్వరంతో సంబంధం లేకపోయినా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లిచ్చి 66లక్షల ఎకరాల్లో 1 కోటి 50లక్షల వరి ధాన్యం తెలంగాణ రైతులు పండించారు.ఇది వాస్తవం. దీనిపై బిఆర్ఎస్ ఇప్పటివరకు స్పందించలేదు.
‘రైతు సంక్షేమం కాంగ్రెస్ పార్టీ పేటెంట్’ అన్నది కీలకమైన పాయింటు. పదేండ్ల పాటు రైతులంటే కేసీఆర్ అనీ,కేసీఆర్ అంటే రైతులనీ,రైతుల సంక్షేమం బిఆర్ఎస్ పేటెంటు అని జరుగుతున్న ప్రచారాన్ని ఒక్క మాటతో రేవంత్ తోసిపుచ్చారు.
పాలమూరు బిడ్డలు కేసీఆర్ ను పల్లకిలో మోస్తే గుండెలపై తన్ని వలసలు పెరిగేలా చేశారని,ఆనాడు పాలమూరును దత్తత తీసుకుంటా అని చెప్పిన కేసీఆర్ పదేళ్ల ఆయన పాలనలో జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదని కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ డిఫెన్సులో పడేశారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా నిర్లక్ష్యం చేసిందో సీఎం వివరించారు.రెండేండ్లలోనే ‘గ్రీన్ ఛానల్ ‘ఏర్పాటు చేసి దాని ద్వారా నిధులు మంజూరు చేసి,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 20 లక్షల సాగునీరు అందే ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ రైతు పండగకు హాజరైన రైతులకు గొప్ప ‘కిక్కు’ ఇచ్చినట్లయింది.
”నా ప్రాంత అభివృద్ధి కోసం,ఇక్కడి యువత కోసం కొడంగల్ లో పారిశ్రామిక వాడ నిర్మించాలనుకుంటే,లగచర్ల చిచ్చు పెట్టి అమాయక లంబాడాలను జైల్లో పెట్టించిండ్రు.వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయిండ్రు. నేను ఆనాడే చెప్పిన వాళ్ల మాయ మాటలు నమ్మొద్దని.ఒక్క కేసీఆర్ కే గజ్వేల్ లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. మా పారిశ్రామిక వాడ కోసం 1300 ఎకరాలు ఉండొద్దా”? అని ముఖ్యమంత్రి రేవంత్ ప్రజల్లో ఆలోచన కలిగించారు.ఏ ప్రాంతంలోనయినా ప్రజలకు స్థానిక ‘సెంటి మెంటు’ ఒక మత్తు మందు లాంటిది.
తమ ప్రాంతం అభివృద్ధి జరగాలని,తమ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు రావాలని కోరుకోవడం సహజం.
‘అభివృద్ధి జరగాలంటే కొందరు నష్టపోక తప్పదు.వారికి కావాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుంది.మన ప్రాంతానికి పరిశ్రమలు రావద్దా?ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఒక తరం పరిస్థితే మారుతుంది.అలాంటి అవకాశం మీరు కోల్పోవద్దు.పారిశ్రామిక వాడ తెచ్చి 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది.బీఆర్ఎస్ నేతల ఉచ్చులో రైతులు పడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.వారి మాటలను నమ్మి మోసపోవద్దు’! సీఎం రేవంత్ అని అన్నారు.
మహబూబ్ నగర్ సభలో రేవంత్ ‘రాజకీయ పరిణతి’ ని ప్రదర్శించారు.”కేకే గారు,మీ అనుభవం అంత లేదు నా వయసు.సీనియర్ మంత్రుల సహకారం లేకుంటే అభివృద్ధి అస్సలు సాధ్యం కాదు. రైతులకు బోనస్ ప్రకటించిన ఘనత మంత్రి ఉత్తమ్‌కే దక్కుతుంది.రేవంత్ రెడ్డి పాలమూరు అల్లుడు.అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రైతు రుణమాఫీ చేయగలిగామంటే అదంతా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చలవే. మంత్రి దామోదర అంటే నాకు చాలా ఇష్టం.అందుకే. అందుకే ఈ జిల్లాకు ఇన్‌చార్జిగా పెట్టుకున్నా.కేకే గారి అనుభవం అంత లేదు నా వయసు” అని చేసిన వ్యాఖ్యలతో అందరూ ఫిదా అయిపోయారు. టీ కాంగ్రెస్‌లో రేవంత్ నయా మార్క్ చూపారు. పాలనలో క్రెడిట్ మొత్తం సీనియర్లకే ఇవ్వడంపై రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తున్నది.కేసీఆర్ ‘స్టయిలు’ ఇందుకు పూర్తి భిన్నం. ఆయన ఎప్పుడూ ‘ఒక బృందం’ గా మాట్లాడరు. తానే సర్వాంతర్యామిలా వ్యవహరిస్తారు. తన కేబినెట్ సహచరులకు,పార్టీ సీనియర్లకు అలాంటి మర్యాద ఇచ్చేవారో,వారి ఆత్మ గౌరవం దెబ్బ తినేలా ఎట్లా పనిచేసేవారో,ఆ పార్టీ నాయకులందరికీ తెలుసు.వాళ్ళు లోలోన కుమిలి,కుమిలి ఏడ్చేవారు తప్ప బయటకు ఒక్క మాట కూడా జారేవారు కాదు. అంతగా వారిపై కేసీఆర్ నిఘా ఉండేది.
కేసీఆర్ ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అమలు చేసింది.తెలంగాణలోని భూ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి పేరిట గరిష్ఠంగా 51 ఎకరాల వరకూ వ్యవసాయ భూమి,21 ఎకరాల వరకూ బీడు భూమి ఉండొచ్చు.ఈ లెక్కన 51 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న వ్యక్తి ఖాతాలో రైతు బంధు కింద ఏడాదికి రూ. 5,10,000 డబ్బు అందింది. లబ్ధిదారుల్లో సినీ ప్రముఖులు,
మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఇతర సంపన్నులు,చివరకు వ్యవసాయాన్ని మానేసి ఉద్యోగాలు,వ్యాపారాలు చేసుకుంటున్నవారికి, విదేశాల్లో ఉంటున్నవారికి కూడా రైతు బంధు ద్వారా లబ్ధి జరిగిందంటే ఈ పథకం ద్వారా ఎంత ‘దుబారా’ జరిగిందో,ఎంత దుర్వినియోగం జరిగిందో అంచనా వేయవచ్చు.
రైతు బంధు కింద ప్రయోజనం పొందిన వారిలో ఎక్కువ మంది అసలు రైతులే కాదన్నది వాస్తవం. భూస్వాములకు, సంపన్నవర్గాల కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకంతో లాభం చేస్తోందన్న విమర్శలు పథకం అమలు జరిగినంత కాలం వస్తూనే ఉన్నవి.బీజేపీ ఎంపీ,పూర్వాశ్రమంలో కేసీఆర్ కేబినెట్ సహచరుడు ఈటల రాజేందర్ పలుమార్లు దీన్ని ప్రస్తావించారు.కేబినెట్ సమావేశాల్లోనూ తాను ఈ విషయాన్ని లేవనెత్తినట్టు ఆయన గుర్తుచేశారు. రైతు బంధు కింద తన కుటుంబానికి కూడా రూ.3 లక్షలు వస్తున్నాయని,తనలా ఆర్థికంగా బాగున్నవారికి ప్రభుత్వ సాయం ఎందుకని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తూ వారిని భిక్షగాళ్లలా చూడటానికి బదులు,వారికి నిజంగా చేయూతనిచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
”మంచం ఎంత ఉంటే,అంత మేరకు మాత్రమే కాళ్ళు చాపాలి” అని సీఎం రేవంత్ రెడ్డి రైతుపండగ సభలో చేసిన వ్యాఖ్యలో చాలా అర్ధమున్నది. ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్ధిక వనరులు,పరిమితులు,కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు,గతంలో కేసీఆర్ అమలుచేసిన పథకాల్లో కొన్నిటినయినా అమలుచేయడం వంటి సవాళ్ళను సీఎం ఎదుర్కుంటున్నారు. కనుక ‘పిండి ఉన్నంత మేరకే రొట్టెలు’ తయారవుతాయని చెప్పడానికి ఈ వ్యాఖ్య చేసినట్లు భావించాలి.రైతు బంధు( రైతు భరోసా)పై మంత్రిమండలి ఉపసంఘం నివేదిక ఆధారంగా,అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి,కొన్ని ఎకరాల వరకూ పరిమితి పెట్టి,ఆ మేరకే ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతి తర్వాత ‘ రైతు భరోసా ‘ డబ్బు రైతుల ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ఆదివారం ప్రకటించారు.
సీలింగ్ ప్రతిపాదనలను కేసీఆర్ ప్రభుత్వం గతంలో తోసిపుచ్చింది.”ప్రతి ఎకరమూ సాగులోకి రావాలన్న ఉద్దేశంతోనే సీలింగ్ పెట్టడం లేద”ని అప్పట్లో కేసీఆర్ కేబినెట్ సహచరుడు నిరంజన్ రెడ్డి అన్నారు.
‘తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక’ ప్రకారం సుమారు ఐదు ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉన్న రైతులు 14.2%.ఉన్నారు. వీరి ఆధీనంలో 44.6% వ్యవసాయ భూమి ఉంది. ఈ లెక్కన 14.2% మందికి రైతు బంధు కింద వచ్చే సాయంలో 44.6% వాటా అందుతున్నది. మిగతా 55.4% వాటాను 85.8% మందికి వెళుతోంది. దాదాపు పది ఎకరాలకు మించి భూమి ఉన్నవారు 3.3% మంది ఉన్నారు. వీరి ఆధీనంలో 19% భూమి ఉంది.రైతు బంధు సాయంలో వారి 19% వాటా.తక్కువ భూమి కలిగిన వారి కన్నా ఎక్కువ భూమి కలిగినవారు ప్రభుత్వ సాయంలో ఎక్కువ వాటా పొందుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
రైతు బంధు విషయంలో సామాజిక,ఆర్ధిక అసమానతలను నాటి కేసీఆర్ సర్కారు పూర్తిగా విస్మరించిందన్న విమర్శలున్నవి.భూమి కేవలం కొన్ని కులాల దగ్గర పోగుపడింది.రైతు బంధులో పాటిస్తున్న పద్ధతి వలన తక్కువ భూమి ఉన్నవారికి తక్కువ లబ్ధి,ఎక్కువ భూమి ఉన్నవారికి ఎక్కువ లబ్ధి చేకూరేలా విధానం పెట్టారన్న విమర్శలూ ఉన్నవి.
ఎస్.కే.జకీర్,
సీనియర్ జర్నలిస్ట్.