Mahaa Daily Exclusive

  ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

Share

ఏపీ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపర్చడానికి ఉద్దేశించిన కొన్ని పాలసీలకు కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఐటీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలిపింది. కోవర్కింగ్ సీర్స్ కు స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు వారికి రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీని ఐటీ హబ్ గా అభివృద్ధి చేయాలని, ఏటా చదువుకుని బయటికి వస్తున్న లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా చూడాలని నిర్ణయించినట్లు మంత్రి పార్ధసారధి తెలిపారు.

 

వచ్చే ఐదేళ్లలో 10 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా రూపొందించిన గార్మెంట్స్ పాలసీకి కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. పెట్టుబడిదారుల్ని మూడు కేటగిరీలుగా విభజించి వారికి రాయితీలు కల్పిస్తామని మంత్రి పార్ధసారధి తెలిపారు. ఏపీ మారిటైమ్ పాలసీ 4.0 ని కూడా కేబినెట్ ఇవాళ ఆమోదించింది. 975 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని లక్ష్యంగా తీసుకుని పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం దీన్ని రూపొందించామన్నారు. రాష్ట్రంలో ఓ మెగా షిప్ యార్డ్ ను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్దానం, పులివెందుల, డోన్ తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఇళ్లను పూర్తి చేయాలని కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0 అమలుకు కూడా మంత్రివర్గం ఆమోదించింది. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చే విధానానికి కూడా అమలు చేయాలని నిర్ణయించింది.

 

అమరావతి రాజధానిలో 11 వేల 471 కోట్లతో చేపట్టబోయే పనులకు నిన్న సీఆర్డీఏ ఆమోద ముద్ర వేసిన పనులకు కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి పనులు వదిలేయడం వల్ల రూ.286.74 కోట్ల నష్టం జరిగిందని కేబినెట్ తేల్చింది. గతంలో అమరావతి టెండర్లు పిలిచినప్పుడు వ్యాట్ గా ఉన్న పన్ను జీఎస్టీగా మారడంతో 452.35 కోట్లు పెరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. గతంలో, ఇప్పటికీ రేట్లు పెరగడం వల్ల రూ.2500 కోట్ల మేర వ్యయం పెరిగిందన్నారు. న్యాయపరమైన, సాంకేతిక సమస్యల్ని దాటి ఈ నెలాఖరున అమరావతి టెండర్లు పిలిచే దశకు వచ్చామన్నారు. వచ్చే నెల నుంచి పనులు మొదలవుతాయన్నారు.

 

మరోవైపు కేబినెట్ భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో జల్ జీవన్ మిషన్ ఆలస్యంపై చంద్రబాబు అసంతృప్తి తెలిపారు. అధికారుల వల్లే ఈ పథకం రాష్ట్రంలో ముందుకెళ్లడం లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయినందున తమ పనితీరుపై నివేదికలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.