Mahaa Daily Exclusive

  సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు…

Share

  • సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు
  • తల్లికి రూ.25 లక్షల పరిహారం
  • హైకోర్టు కీలక తీర్పు

అమరావతి, మహా : రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ గాదె సాయికృష్ణ కేసు విచారణను రాష్ట్ర పోలీసుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు కస్టడీలో సాయికృష్ణ తీవ్ర వేధింపులకు, చిత్రహింసలకు గురయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. సిట్ దర్యాప్తులోనూ ఇదే విషయాలు గుర్తించి, ఛార్జిషీటులో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ కేసులో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని, సీబీఐకి అప్పగించాలని కోరుతూ గాదె సాయికృష్ణ తల్లితో పాటు మరికొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లు సమర్పించిన వాదనలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీబీఐ విచారణకు ఆదేశిస్తూ కీలక తీర్పునిచ్చింది.

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తనకు న్యాయం చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులను సీబీఐకి అందించాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. అందుకు వారం రోజులు కేటాయించింది. బాధితుడి తల్లి విజయలక్ష్మీకి 4 వారాల్లోగా 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

అసలేం జరిగింది ?

మే నెలలో కృష్ణలంక పోలీసుల అదుపులోకి వెళ్లిన సాయికృష్ణ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఆపై తల్లి ఫిర్యాదు చేయడం, కస్టడీలోకి వెళ్లిన సాయికృష్ణ అదృశ్యం కావడం, ఆపై చనిపోయాడని బయటకు వచ్చింది. తరువాత డెడ్‌బాడీ అదృశ్యం, పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు తలెత్తాయి. తమ కొడుకుని విచారణ పేరుతో తీసుకెళ్లి చంపేశారని, తమకు బూడిద కూడా మిగల్చలేదని కుటుంబ సభ్యులు పోలీసులపై ఆరోపణలు చేశారు. తరువాత ప్రభుత్వంపై విమర్శలు రావడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. కస్టోడియల్ డెత్ అని సిట్ ఛార్జ్ షీటులో స్పష్టం చేసింది. ఇటీవల కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీటులో పోలీసులు కొట్టడం, బయట తోటలోకి తీసుకెళ్లి టార్చర్ చేయడంతో చనిపోయాడని గుర్తించారు. ఆపై సైలెంట్ గా తీసుకెళ్లి మృతదేహాన్ని దహనం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.