Mahaa Daily Exclusive

  భేష్.. పోలవరం పనులు!

Share

భేష్.. పోలవరం పనులు!
* ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్ నాణ్యతపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.
* స్వయంగా మట్టి తవ్వి పరిశీలించిన పీపీఏ సీఈవో సంజీవ్‌ వోహ్రా
* పోలవరం గ్యాప్‌-2 పనులకు అంతర్జాతీయ నిపుణుల క్లీన్ చిట్.

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టులో కీలకమైన ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ పనుల నాణ్యతను స్వయంగా అంచనా వేసేందుకు విచ్చేసిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరును చూసి ముగ్ధురాలైంది. మట్టి నాణ్యత మొదలుకుని కుదింపు ప్రక్రియ వరకు ప్రతి చిన్న అంశాన్ని అణువణువూ పరిశీలించిన ఈ బృందం.. పనులు అద్భుతంగా జరుగుతున్నాయంటూ కితాబిచ్చింది.

అత్యున్నత ప్రమాణాలతో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణం.

పోలవరం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన, కీలకమైన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రాజెక్టును సందర్శించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో సంజీవ్‌ వోహ్రాతో కలిసి ఈ బృందం గ్యాప్‌-2 ప్రాంతంలో ముమ్మరంగా సాగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసింది. సుమారు మూడున్నర గంటల పాటు ప్రాజెక్టు సైట్‌లో అడుగడుగునా కలియదిరుగుతూ నిశితంగా పరిశీలనలు జరిపారు. ఈ సందర్భంగా పనుల నాణ్యతపై వారు పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్దేశిత అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా పనులు జరుగుతున్న తీరును చూసి “ఇట్స్ వెరీ గుడ్‌.. గోయింగ్ ఆన్ వెరీ వెల్‌” అంటూ అధికారుల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.

స్వయంగా మట్టిని తవ్వి పరిశీలించిన పీపీఏ సీఈవో.

ఈ తనిఖీల్లో పీపీఏ సీఈవో సంజీవ్‌ వోహ్రా సైతం అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. డ్యామ్‌ నిర్మాణంలో వాడుతున్న మట్టి నాణ్యతను పరీక్షించే క్రమంలో ఆయన స్వయంగా మట్టిని తవ్వి పరిశీలించడం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధకు అద్దం పడుతోంది. ప్రధానంగా మట్టిలో తేమ శాతం ఎంతుండాలి, అది నిర్మాణానికి ఎంతవరకు అనుకూలంగా ఉందనే విషయాలను నిపుణుల బృందం సాంకేతికంగా విశ్లేషించింది. డ్యామ్‌ పటిష్టతకు మూలాధారమైన మట్టి కుదింపు ప్రక్రియను (కాంపాక్షన్) వారు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. కుదింపు అనంతరం మట్టి సాధిస్తున్న గట్టిదనాన్ని, అందుకు ఉపయోగిస్తున్న షీప్‌ ఫుట్‌ రోలర్‌ యంత్రాల పనితీరును అంచనా వేశారు. రోలర్‌తో మట్టిని కుదించిన తర్వాత వస్తున్న ఫలితాలు అత్యుత్తమంగా ఉన్నాయని నిపుణులు నిర్ధారించారు.

కొనసాగనున్న నాణ్యతా పరీక్షలు.

దశాబ్దాల కాలం పాటు చెక్కుచెదరకుండా నిలబడాల్సిన భారీ సాగునీటి ప్రాజెక్టు కావడంతో నాణ్యత విషయంలో అధికారులు ఎక్కడా రాజీ పడటం లేదు. ఇప్పటివరకు చేపట్టిన పనులన్నీ సాంకేతికంగా, నాణ్యతాపరంగా అత్యున్నత ప్రమాణాలతో ఉన్నాయని అంతర్జాతీయ బృందం సానుకూల నివేదిక ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రాజెక్టు అధికారులకు కొండంత బలాన్నిచ్చింది. మట్టి నాణ్యత, తేమ శాతం, కుదింపు పరీక్షల్లో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే, ఈ నాణ్యతా ప్రమాణాలను ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఇదే స్థాయిలో కొనసాగించేలా అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూనే ఉంటారు. అంతర్జాతీయ నిపుణుల తాజా పరిశీలన, సానుకూల వ్యాఖ్యలతో పోలవరం నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.