Mahaa Daily Exclusive

  5 వేల పోలీస్ పోస్టులు భర్తీ..! హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు :సీఎం రేవంత్ రెడ్డి..

Share

  • 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ
  • హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు
  • పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి
  • సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మహా : పోలీస్ శాఖలో కొత్తగా 5 వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు మనందరికీ ఎంతో భావోద్వేగమైన రోజు, సమాజ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన దేవ్ సింగ్, ప్రమోద్ కుమార్, గాజుల సౌమ్య వంటి పోలీసు అమరులను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో వారి త్యాగాలను సమాజం ఎప్పటికీ మరచిపోదని, అమరుల కుటుంబాలు ఒంటరి కావు అని, ప్రభుత్వం వారికి సంపూర్ణ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతల పరిరక్షణ ఎంతో ముఖ్యం కాబట్టి, తమ ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

కొత్తగా పోస్టుల భర్తీ, అమరులకు పరిహారం పెంపు

పోలీస్ శాఖలో కొత్తగా మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నామని, 2028 నాటికి అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 112 మంది డీఎస్పీలను నియమించామని, ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి వారి ఆత్మగౌరవాన్ని పెంచామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను భారీగా పెంచినట్లు వివరించారు. కానిస్టేబుళ్ల ఎక్స్‌గ్రేషియాను రూ.40 లక్షల నుండి రూ.1 కోటికి, హెడ్ కానిస్టేబుళ్లు/ఏఎస్‌ఐలకు రూ.45 లక్షల నుండి రూ.1 కోటికి, ఎస్‌ఐలకు రూ.45 లక్షలు, ఇన్‌స్పెక్టర్లకు రూ.50 లక్షల నుండి రూ.1.25 కోట్లకు, డీఎస్పీ/అడిషనల్ ఎస్పీలకు రూ.50 లక్షల నుండి రూ.1.50 కోట్లకు, ఎస్పీ/ఐపీఎస్ అధికారులకు రూ.1 కోటి నుండి రూ.2 కోట్లకు పెంచామని తెలిపారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే హోంగార్డుల కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమని వ్యాఖ్యానించారు. అలాగే, హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారుల పిల్లల చదువు కోసం ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ప్రారంభించామని తెలిపారు. విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా 150 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల భద్రత కోసం పనిచేస్తున్నారని, వారి త్యాగాల వల్లే ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని అన్నారు. దేశం, సమాజం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను ఎప్పటికీ మర్చిపోబోమని స్పష్టం చేశారు. అమరుల కుటుంబాలకు పరిహారంతోపాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలు కూడా అందించనున్నట్లు సమాచారం. పోలీసు భద్రతా నిధి నుంచి రూ.16 లక్షలు, పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.8 లక్షలు అదనంగా అందించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా అర్హులైన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నివాస స్థలాలు, పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు, బస్‌ పాస్‌లు కల్పించనున్నారు. పిల్లలకు వైద్య విద్యలో ప్రత్యేక రిజర్వేషన్లు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల నియంత్రణలోనూ తెలంగాణ పోలీసు శాఖ కీలక గుర్తింపు సాధించిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన ఈగల్‌ తెలంగాణ బృందం జాతీయ స్థాయి డ్రగ్స్‌ నియంత్రణ సమీక్షలో ఏడు ప్రమాణాల ఆధారంగా 80 శాతానికి పైగా స్కోరు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈగల్‌ బృందాన్ని, డీజీపీ సీవీ ఆనంద్‌ను అభినందించారు. యువతను మాదకద్రవ్యాల ప్రభావం నుంచి రక్షించేందుకు సమన్వయంతో పనిచేయాలని పోలీసు శాఖకు సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో పోలీసులు నిర్వహిస్తున్న పాత్ర వెలకట్టలేనిదని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతోపాటు వారి కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసు సంక్షేమం, ప్రజా భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.