- పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత
- పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
అమరావతి, మహా : ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన తొలిరోజే పలు జిల్లాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, మాచర్ల, ముప్పాళ్ల ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల దాఖలు సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్తున్న సమయంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపైకొకరు పోటీపడి నినాదాలు చేసుకుని, చివరికి దాడులకు దిగడంతో నామినేషన్ కేంద్రాల వద్ద తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరువర్గాల నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టారు.
పుంగనూరులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి
స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) నామినేషన్ల పర్వం అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని మున్సిపల్ హైస్కూల్ సమీపంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య చెలరేగిన వివాదం పరస్పరం రాళ్ల దాడికి దారితీసింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మరోవైపు కడప జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద సైతం టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిపై రాళ్లు రువ్వడంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్డీవో ఆఫీసులోని నామినేషన్ కేంద్రం వద్ద పిడుగురాళ్ల జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి భారతి, ఆమె భర్త లక్ష్మారెడ్డిపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన లక్ష్మారెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పల్నాడు జిల్లాలో నేతల హౌస్ అరెస్టులు
ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పల్నాడు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు కీలక వైసీపీ నేతలను గృహనిర్బంధం చేయడంతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, పిడుగురాళ్లలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డిని, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని బయటకు రాకుండా పోలీసులు వారి నివాసాల్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. నరసరావుపేట నియోజకవర్గంలో పల్నాడు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి సహా రొంపిచర్ల మండలానికి చెందిన మాజీ సర్పంచ్‌లు, స్థానిక నేతల నివాసాల వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు.
నరసరావుపేటలో వైయస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వస్తే.. టీడీపీ గూండాలు దాదాపు 10 మంది నా చీర లాగి వివస్త్రను చేయడానికి ప్రయత్నించారని వంగా పద్మావతి ఆరోపించారు. నామినేషన్ పత్రాలతో పాటు హ్యాండ్ బ్యాగ్‌ను కూడా రోడ్డుపైనే చించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జెడ్పీటిసి, ఎంపీటీసీ నామినేషన్ వేయకుండా వైసీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థులకి మద్దతుగా వెళ్లాలని చూస్తున్న రమేష్ యాదవ్ కి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారని పార్టీ నేతలు అంటున్నారు.








