Mahaa Daily Exclusive

  మీరు జన్ జడ్ కాదు..! సీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

Share

న్యూఢిల్లీ, మహా : కాక్రోజ్‌ జనతా పార్టీ సహ కన్వీనర్లు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకా వయస్సుపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారు జెన్‌ జెడ్‌ తరానికి చెందినవారు కాదని వ్యాఖ్యానించింది. జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనకు సంబంధించిన కేసులో వీరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది అభిక్‌ చిమ్నీ వాదనలు వినిపిస్తూ సౌరవ్‌ దాస్‌ వయస్సు 27 ఏళ్లు కాగా, అశుతోష్‌ రాంకా వయస్సు 32 ఏళ్లని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. “అయితే మీరు జెన్‌ జెడ్‌ కాదు. జెన్‌ జెడ్‌ అంటే ఏమిటి?” అని ప్రశ్నించినట్లు న్యాయవార్తా సంస్థ బార్‌ అండ్‌ బెంచ్‌ వెల్లడించింది. జస్టిస్‌ సుబ్రమోనియం ప్రసాద్‌ ఈ కేసును విచారించారు.

జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనతో కేసు

గతంలో నిరసనలకు అనుమతి లేని ప్రాంతంగా పేర్కొన్న జంతర్‌ మంతర్‌లోకి తాళం వేసిన గేటును దాటి ప్రవేశించారనే ఆరోపణలపై అక్టోబర్‌ 13న దాస్‌, రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఐదు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు. సోమవారం వారిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత, మందిర్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కొత్తగా నియమితులైన ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్‌ మరో రెండు రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. నిరసన సమయంలో సీజేపీకి చెందిన ఇతర కార్యకర్తలతో కలిసి దాస్‌, రాంకా జాతీయ జెండాను ప్రదర్శించినట్లు సమాచారం.