Mahaa Daily Exclusive

  ఎక్సైజ్ శాఖకు దసరా కిక్కు..! నాలుగు రోజుల్లో రూ. 755 కోట్ల మద్యం విక్రయాలు..!

Share

హైదరాబాద్, మహా : తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పండుగల సమయంలో మద్యం కొనుగోళ్లు ఊపందుకోవడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఆదాయం భారీగా సమకూరుతోంది. బోనాల ఉత్సవాలతో మొదలయ్యే ఈ అమ్మకాల జోరు దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలతో పాటు సంక్రాంతి వరకు కొనసాగుతుంటుంది. ఈ నేపథ్యంలో దసరా సీజన్‌లో నమోదైన విక్రయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

నాలుగు రోజుల్లో రూ.755 కోట్లకు పైగా విక్రయాలు

ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.755 కోట్ల 14 లక్షల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ విక్రయాల్లో హార్డ్ లిక్కర్‌తో పాటు బీరు కూడా గణనీయమైన స్థాయిలో అమ్ముడైంది. నాలుగు రోజుల వ్యవధిలో 6.83 లక్షల కేసుల హార్డ్ లిక్కర్ విక్రయించగా, బీరు అమ్మకాలు 10.44 లక్షల కేసులకు చేరుకున్నాయి. తెలంగాణలో బీరు వినియోగం అధికంగా ఉంటుందనే విషయాన్ని ఈ గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. భారీ స్థాయిలో మద్యం విక్రయాలు జరగడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూ.25 కోట్ల వ్యాపారం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ దసరా సందర్భంగా మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. అక్టోబర్ 16, 17, 18 తేదీల్లో కలిపి రూ.25 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు వివరాలు సూచిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 151 వైన్ షాపులు, 30 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా జరిగిన విక్రయాలు పండుగ సమయంలో మద్యం కొనుగోళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తున్నాయి.