Mahaa Daily Exclusive

  ఎన్నికల వేళ హైటెన్షన్

Share

  • రాళ్లదాడులు, గన్‌తో కాల్పులు
  • టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ

కడప, మహా : కడప జిల్లా నందలూరులో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య మొదలైన వివాదం కాస్తా ఘర్షణగా మారింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలు, కుర్చీలతో దాడులకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరగడం స్థానికంగా కలకలం రేపింది. పలు వాహనాలు ధ్వంసం కావడంతో పాటు కారుకు నిప్పు పెట్టిన ఘటనతో నందలూరులో భయాందోళనలు నెలకొన్నాయి.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరులో టీడీపీకి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఎద్దుల విజయసాగర్‌ వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. మరోవైపు మేడా విజయశేఖర్‌రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థి నామినేషన్‌ వేయడానికి రావడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. తమ వర్గం సూచించిన అభ్యర్థులకే అవకాశం ఇవ్వాలని ఇరువర్గాలు పట్టుబట్టడంతో వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. పార్టీ తరఫున నామినేషన్‌ వేసే అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు.

రాళ్లు, కర్రలతో దాడులు.. వాహనాలకు నిప్పు

మొదట మాటలతో ప్రారంభమైన గొడవ కొద్దిసేపటికే హింసాత్మకంగా మారింది. ఇరువర్గాల వారు రాళ్లు, కర్రలు, కుర్చీలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలిసింది. ఘర్షణ కారణంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక కారుతో పాటు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. మరో కారుకు దుండగులు నిప్పు పెట్టడంతో అది పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. మేడా విజయశేఖర్‌రెడ్డిపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో నందలూరులో కొంతసేపు యుద్ధ వాతావరణం నెలకొంది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు

ఘర్షణ తీవ్రత పెరగడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఓ టీడీపీ నేత గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. తిరుపతికి చెందిన ఎలైట్ ఆసుపత్రి చైర్మన్‌గా ఉన్న బాలసుబ్రహ్మణ్యం కాల్పులు జరిపినట్లు వివిధ కథనాల్లో పేర్కొన్నారు. కానీ దీన్ని న్యూస్ 18 పూర్తిగా నిర్ధారించ లేదు. అయితే, ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.

రంగంలోకి పోలీసులు

ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కాల్పులు, వాహనాల దహనం, దాడులకు సంబంధించి విచారణ చేపట్టారు. నామినేషన్ల వివాదం హింసాత్మకంగా మారడంతో నందలూరులో ఉద్రిక్తత కొనసాగింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, కాల్పులు జరిపిన అంశం, ఆస్తుల ధ్వంసంపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.