Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ

Share

  • కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..

హైదరాబాద్, మహా : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ సైబర్ దోపిడీ వెలుగు చూసింది. రాయదుర్గంలోని ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ సిస్టమ్‌లని లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లు, అత్యంత చాకచక్యంగా కంపెనీ డిజిటల్ నెట్‌వర్క్‌లోకి చొరబడ్డారు. ఉదయం 10:31 గంటల నుంచి 11:58 గంటల మధ్య కేవలం 87 నిమిషాల వ్యవధిలోనే రూ. 3.34 కోట్ల నిధులను అక్రమంగా లూటీ చేశారు. ఈ సైబర్ దాడిలో కేటుగాళ్లు సదరు సంస్థకు చెందిన బేగంపేట బ్రాంచ్ బ్యాంక్ ఖాతాను లక్ష్యంగా చేసుకున్నారు. అత్యాధునిక హ్యాకింగ్ మెళకువలను ఉపయోగించి, సంస్థ అంతర్గత సిస్టమ్‌లను హ్యాక్ చేసిన నేరగాళ్లు, కంపెనీ అనుమతి లేకుండానే నిధులను విదేశీ , స్వదేశీ నెట్‌వర్క్‌ల ద్వారా మళ్లించారు. కేవలం గంటన్నర సమయంలోనే ఏకంగా 183 విడతల్లో అత్యంత వేగంగా ఈ లావాదేవీలు పూర్తి చేసి, దేశవ్యాప్తంగా ఉన్న 52 వేర్వేరు ఖాతాల్లోకి మొత్తం రూ. 3.34 కోట్లను బదిలీ చేశారు.

సిస్టమ్‌లో అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ భారీ నిధుల మళ్లింపును గమనించిన కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన అందించిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఈ నిధులన్నీ బెంగళూరు, దిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాలకు చేరినట్లు పోలీసులు గుర్తించారు. నిధులు మళ్లించిన ఈ 52 ఖాతాలన్నీ సైబర్ నేరగాళ్లు కమీషన్ల కోసం ఉపయోగించే ‘మ్యూల్ ఖాతాలు’ అయి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బు డిపాజిట్ అయిన వెంటనే ఇతర విదేశీ లేదా క్రిప్టో ఖాతాల్లోకి మార్చకుండా నిరోధించేందుకు, ఐపీ చిరునామాలు , బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్రాక్‌ల ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేశారు.