- 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం.
- రక్షణ, అంతరిక్షం, ఐటీ, సైబర్ భద్రత రంగాల్లో కీలక ఒప్పందాలు.
న్యూఢిల్లీ , మహా.
భారత్, మధ్య ఐరోపా దేశమైన పోలండ్ మధ్య వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలు సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టాయి. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన పోలండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఇరు దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాల సమక్షంలో జరిగిన ఈ ద్వైపాక్షిక చర్చల్లో వ్యాపారం, రక్షణ, అంతరిక్షం, అణు, సాంకేతికత సహా పలు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా రాబోయే 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరువురు నేతలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
భారత్‌లో పెట్టుబడులకు రండి.. ‘స్టార్టప్ బ్రిడ్జి’ నిర్మిద్దాం: ప్రధాని మోదీ
చర్చల అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్, పోలండ్ మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య బంధంపై తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. పోలండ్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఒక ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించినందుకు ప్రధాని డొనాల్డ్ టస్క్‌కు, ఆ దేశ ప్రజలకు మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
భారత్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించిన మోదీ.. మేక్ ఇన్ ఇండియాలో భాగస్వాములు కావాలని పోలండ్ కంపెనీలను ఆహ్వానించారు. ఇప్పటికే పోలండ్‌లో అనేక భారతీయ ఐటీ దిగ్గజ సంస్థలు అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఐటీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయని, యువత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు భారత్-పోలండ్ మధ్య సరికొత్త ‘స్టార్టప్ బ్రిడ్జి’ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. అంతేకాకుండా భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ద్వారా కనెక్టివిటీని మరింత పెంపొందించడంపైనా ఇరు నేతలు చర్చించారు.
భారత్ చూపిన ఆదరాభిమానాలకు ముగ్ధులైన పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్.. ప్రపంచ వేదికపై భారత్ పోషిస్తున్న పాత్రను కొనియాడారు. “ప్రపంచానికే భారత్ ఒక ఆశాకిరణంలా నిలుస్తోంది. అంతర్జాతీయ వేదికపై భారత్ స్థాయిని, గౌరవాన్ని పోలండ్ ఎప్పటికీ తగ్గించబోదు” అని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలు ఒకదానికొకటి మద్దతుగా నిలుస్తూ పరస్పర ప్రయోజనాలు పొందాలన్నారు. ఆపత్కాలంలో శాటిలైట్లు, డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతికత ఎంత కీలకమో రుజువైందన్నారు. ముఖ్యంగా అరుదైన ఖనిజాలు (రేర్ ఎర్త్ మినరల్స్), సహజ వనరుల విషయంలో ఏ దేశానికాదేశం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను వర్తమాన పరిణామాలు నిరూపించాయని టస్క్ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభంపై ప్రధాని మోదీ ఈ వేదికగా మరోసారి భారత్ వైఖరిని కుండబద్దలు కొట్టారు. యుద్ధభూమిలో ఏ సమస్యా పరిష్కారం కాదని పునరుద్ఘాటించారు. “అది రష్యా-ఉక్రెయిన్ యుద్ధమైనా సరే.. పశ్చిమాసియా సంక్షోభమైనా సరే.. రక్తపాతాన్ని ఆపి శాంతి స్థాపన చేసేందుకు జరిగే ప్రతి ప్రయత్నంలోనూ భారత్ ముందుంటుంది. దౌత్యపరమైన, అర్థవంతమైన చర్చల ద్వారానే వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రపంచ శాంతి కోసం జరిగే ప్రతి కదలికకూ భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.







