Mahaa Daily Exclusive

  జైలు నుంచి బయటకు రాగానే సీజేపీ నేతలకు క్రైమ్ బ్రాంచ్ షాక్!

Share

  •  తిహార్ జైలు నుంచి విడుదలైన కొద్దిసేపటికే సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు నోటీసులు.
  •  జంతర్ మంతర్ వద్ద నిబంధనల ఉల్లంఘన, అక్రమ ప్రవేశం కేసుల్లో విచారణకు ఆదేశం.

న్యూఢిల్లీ, మహా.

వారం రోజుల జుడీషియల్ కస్టడీ అనంతరం బెయిల్‌పై తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఊహించని షాకిచ్చారు. బుధవారం రాత్రి జైలు గేటు దాటి బయటకు వచ్చిన కొద్దిసేపటికే వారిద్దరికీ విచారణ నోటీసులు అందజేశారు. జంతర్ మంతర్ వద్ద నిబంధనలను ఉల్లంఘించి నిరసన చేపట్టిన కేసుకు సంబంధించి గురువారం మధ్యాహ్నం క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మరోవైపు ఈ నిరసనల్లో కీలకంగా వ్యవహరించిన మరో సీజేపీ నేత అజింక్య షిండే పాత్రపైనా పోలీసులు లోతుగా ఆరా తీస్తుండటం ఉత్కంఠ రేపుతోంది.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భారీగా అవకతవకలు జరిగాయని, ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని సీజేపీ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 10న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని చెరో రూ. 50 వేల పీస్ బాండ్ రాయించుకుని విడిచిపెట్టారు.

అయితే, నిరసనలకు అనుమతి లేని ప్రాంతంగా (డీ-నోటిఫైడ్) ప్రకటించిన జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 13న సీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల బారికేడ్లను దాటుకుని, సమీపంలోని ఓ ప్రైవేటు భవనం గుండా అక్రమంగా జంతర్ మంతర్‌లోకి దూసుకెళ్లారు. దీంతో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, అక్రమ ప్రవేశం, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడం (బీఎన్ఎస్ సెక్షన్ 223/233 తదితర సెక్షన్ల కింద) వంటి అభియోగాలపై కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లలో రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

శాంతి ఒప్పందం (పీస్ బాండ్) నిబంధనలను ఉల్లంఘించినందుకు అక్టోబర్ 14న సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అరెస్టు చేసిన పోలీసులు, కోర్టు ఆదేశాలతో తిహార్ జైలుకు తరలించారు. వారం రోజుల జుడీషియల్ కస్టడీ ముగియడంతో బుధవారం ఈ కేసు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు వచ్చింది. నిందితులకు మరో మూడు రోజుల పాటు జుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

జంతర్ మంతర్‌పై నిషేధం ఉన్నంతవరకు అక్కడ ఎలాంటి నిరసనలకు పిలుపునివ్వబోమని, రాజ్యాంగ పరిధిలోనే నడుచుకుంటామని ఇద్దరు నేతలు లిఖితపూర్వక హామీ (అండర్ టేకింగ్) ఇవ్వడంతో.. వారిని ఇంకా కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. చెరో రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై వారికి బెయిల్ మంజూరు చేసింది.

కోర్టు ఆదేశాలతో బుధవారం రాత్రి తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు రాత్రి 8.30 గంటల సమయంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ (ఇంటర్ స్టేట్ సెల్) పోలీసులు నోటీసులు ఇచ్చారు. కన్నాట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్లలో నమోదైన రెండు కేసులను ఉన్నతాధికారులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయడంతో దర్యాప్తు వేగవంతమైంది. గురువారం మధ్యాహ్నం విచారణకు రావాలని ఆదేశించగా.. జైలు నుంచి ఇప్పుడే విడుదలైనందున తమకు మరింత సమయం కావాలని సౌరవ్, అశుతోష్ పోలీసులను కోరినట్లు సమాచారం. మరోవైపు ఈ నిరసనల్లో పాల్గొన్న సీజేపీ నేత అజింక్య షిండేను కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.