- కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు.
- రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో నీటిపారుదల రంగాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని, కేవలం కమీషన్ల దందాల కోసమే ప్రాజెక్టులను రీడిజైన్ చేశారంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పడంలో, నిత్యం ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ కుటుంబం అన్ని హద్దులను మీరిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు పదేపదే అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే మేడిగడ్డకు మార్చిందని ఆరోపించారు. కేవలం 37 వేల కోట్ల రూపాయలుగా ఉన్న ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ఏకంగా లక్షన్నర కోట్లకు పెంచేశారని దుయ్యబట్టారు. తాము నిర్మించిన ప్రాజెక్టు తమ హయాంలోనే కూలిపోయినా, ఆ పార్టీ నేతలకు కనీసం సిగ్గులేకుండా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కేవలం 2 వేల కోట్ల వ్యయాన్ని ఏకంగా 20 వేల కోట్లకు పెంచేశారని, వేల కోట్లు ఖర్చు పెట్టినా కనీసం ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా అని నిలదీశారు. జూరాల, దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ (SLBC) వంటి కీలక ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉంటే ఈరోజు ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉండేది కాదన్నారు. రాష్ట్రంలోని నీటి పారుదల వ్యవస్థను కేసీఆర్ అండ్ కంపెనీ పూర్తిగా సర్వనాశనం చేసిందని ఆరోపించారు. అబద్ధాలు చెబుతూ ప్రజలను నిత్యం మోసం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పేర్ల ముందు ‘జోసెఫ్ గోబెల్స్’ అని పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుందని మంత్రి ఉత్తమ్ తీవ్ర పదజాలంతో విమర్శించారు.
మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, నీటి పారుదల రంగంపై పూర్తి అవగాహనా రాహిత్యం వల్లే నేడు రాష్ట్ర ప్రజలు తాగు, సాగునీరు అందక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో నగరవాసులు తాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో ఎప్పుడూ ట్యాంకర్ల అవసరం రాలేదని, కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఆ నాటి చీకటి రోజులు తిరిగొచ్చాయని విమర్శించారు. ప్రాజెక్టులు నిర్మించి సాగు, తాగునీరు అందించిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో లేని నీటి కొరత నేడు కాంగ్రెస్ హయాంలో ఎందుకు ఏర్పడుతోందని నిలదీసిన బీఆర్ఎస్ నేతలు.. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.







