- సొసైటీలకు ఆర్థిక భరోసా
- ప్రతి సొసైటీకి కొత్త పంట రుణాల కింద రూ.10 లక్షలు కేటాయింపు
- జిల్లా కలెక్టర్, డీసీసీబీ పర్సన్-ఇన్-ఛార్జి కమిటీ అధ్యక్షురాలు చాహత్ బాజ్‌పాయి
కలెక్టరేట్, మహా ;
ప్రతి సొసైటీకి కొత్త పంట రుణాల కింద రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్, డీసీసీబీ పర్సన్-ఇన్-ఛార్జి కమిటీ అధ్యక్షురాలు చాహత్ బాజ్ పాయ్ ప్రకటించారు.
వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహాజన సభ సమావేశం హనుమకొండ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, బ్యాంకు పర్సన్-ఇన్-ఛార్జి కమిటీ అధ్యక్షురాలు చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు
బ్యాంకు డి ఆర్ ఓ ఎస్ డి వెంకటేశ్వర్లు, జీఎం ఉషాశ్రీ, ఇతర బ్యాంకు అధికారులు, పిఎసిఎస్ అధ్యక్షులు, ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ సర్టిఫికేషన్, వార్షిక ఆర్థిక నివేదికలు, బ్యాలెన్స్ షీట్, లాభనష్టాల ఖాతా, నికర లాభాల వినియోగం ఆడిటర్ల నియామకం వంటి అంశాలను పరిశీలించారు.
బ్యాంకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.10.23 కోట్ల నికర లాభాన్ని సాధించగా, సభ్యులకు రూ.1.53 కోట్ల డివిడెండ్ ప్రకటించారు.
జిల్లా కలెక్టర్ 50% కంటే ఎక్కువ రికవరీ సాధించిన అర్హతగల సొసైటీలకు రూ.50 లక్షల వరకు, మిగిలిన ఏ,బి కేటగిరీ ఆడిట్ ర్యాంకింగ్ సొసైటీలకు రూ.30 లక్షల వరకు దీర్ఘకాలిక రుణాల సదుపాయం కల్పించే అంశాన్ని వెల్లడించారు.
రుణ బకాయిదారులకు ఉపశమనం కల్పించేందుకు వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని 31 మార్చి 2027 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
బ్యాంకు శాఖల విస్తరణలో భాగంగా భూపాలపల్లి, ములుగు, ఘనపూర్ శాఖల భవన నిర్మాణాలకు స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయినట్లు వెల్లడించారు.
గూడూరు బ్రాంచ్ కు చెందిన కస్టమర్ కంచె సునీల్ ప్రమాద మరణ బీమా క్లెయిమ్ కింద రూ.2 లక్షల పరిహార చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. కొన్ని సొసైటీల ప్రతినిధులు బ్యాంకు అనుబంధం గురించి లేవనెత్తిన ప్రశ్నలకు అదనపు కలెక్టర్ ఎన్. రవి కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాలను పరిశీలిస్తామని తెలిపారు.
సహకార సంఘాల ఆర్థిక బలోపేతం, రుణ సదుపాయాల విస్తరణ, రికవరీ మెరుగుదల రైతులకు మెరుగైన సేవలు అందించడంపై సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. రవి, హనుమకొండ డిసిఒ బి. మోహన్, సీఈవో మహ్మద్ వజీర్ సుల్తాన్ వరంగల్ డిసిఒ నిరజ, నాబార్డ్ డి డి ఎం చంద్రశేఖర్, భూపాలపల్లి డిసిఓ వల్యా నాయక్, మహబూబాబాద్ డిసిఓ సర్దార్ సింగ్ పాల్గొన్నారు.








