Mahaa Daily Exclusive

  సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన స్థలంలోనే రామమందిరం నిర్మించారా?

Share

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన స్థలంలోనే రామమందిరం నిర్మించారా?
* తేల్చాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్.
* రేపు విచారణ
న్యూదిల్లీ,మహా.

అయోధ్యలో నూతనంగా నిర్మించిన భవ్య రామమందిరాన్ని 2019లో సుప్రీంకోర్టు కేటాయించిన అసలు స్థలంలోనే నిర్మించారా? లేదా? అన్నది శాస్త్రీయంగా నిర్ధారించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని ప్రాంగణంలోనే కచ్చితమైన సరిహద్దులు, కోఆర్డినేట్లను అనుసరించి ఆలయ నిర్మాణం జరిగిందో లేదో తేల్చేందుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘శ్రీరామ జన్మభూమి కేసు ట్రస్ట్’ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం నవంబర్ 2న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
ఆలయ నిర్మాణానికి సంబంధించి కచ్చితమైన సరిహద్దులను గుర్తించేందుకు రెవెన్యూ, పురావస్తు, సర్వే శాఖల నిపుణులతో కూడిన కమిషన్ల ఏర్పాటు అత్యవసరమని పిటిషన్‌లో కోరారు. ఒకవేళ 2019 నాటి తీర్పులో పేర్కొన్న స్థలానికి, ప్రస్తుతం ఆలయం నిర్మించిన ప్రదేశానికి మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు పరిశీలనలో తేలితే, ఆ తీర్పును యథాతథంగా అమలు చేసేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. అలాగే, ఆలయ ప్రాంగణానికి సంబంధించిన మ్యాప్‌లు, సర్వే రికార్డులు, ప్రణాళికలు, అసలు పత్రాలన్నింటినీ భద్రపరిచి న్యాయస్థానం ముందు ఉంచేలా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఆదేశించాలని విన్నవించారు.
ఆలయ నిర్వహణ, నిధుల వినియోగంపైనా పిటిషనర్లు ధర్మాసనానికి కీలక విజ్ఞప్తులు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, విరాళాలు, కానుకల రసీదుల వివరాలను ప్రతిరోజూ డిజిటలైజ్ చేసి పారదర్శకంగా ప్రదర్శించాలని కోరారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆడిట్ నిర్వహించేలా ట్రస్టును ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాల పాటు సాగిన అయోధ్య భూ వివాదంపై 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు వెలువరించిన విషయం విదితమే. కూల్చివేసిన బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంలో ట్రస్ట్ ద్వారా రామమందిరాన్ని నిర్మించాలని, మసీదు కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆనాడు తీర్పునిచ్చింది.